దిగులు పడొద్దమ్మా.. బాబు బాధ్యత నాది- ఎమ్మెల్యే రాచమల్లు

28 Aug, 2019 10:59 IST|Sakshi
బాబు బాధ్యత నాదే అంటున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 

సాక్షి, ప్రొద్దుటూరు : ‘తండ్రి లేని పిల్లాడని దిగులు చెందవద్దమ్మా.. ఈ బాబు బాధ్యత నేను తీసుకుంటా’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ వీధిలో నివాసం ఉంటున్న రాజేష్‌ గత నెల 7న తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతనితో పాటు మరో ఇరువురు మృత్యువాత పడ్డారు. రాజేష్‌ చనిపోయే నాటికి అతని భార్య షబానా గర్భిణి. సోమవారం ఆమె జిల్లా ఆస్పత్రిలో ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వార్డుకు వెళ్లి షబానా, పసికందు ఆరోగ్య స్థితిగతులపై వైద్యులతో మాట్లాడారు.

ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకొని రాజేష్‌ రూపంలో దేవుడు పంపించాడని అన్నారు. ‘దిగులు పడ వద్దమ్మా.. ఈ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటా ’ అని అన్నారు. బాబుకు 19 ఏళ్లు వచ్చే నాటికి రూ. 10 లక్షలు చేతికి వచ్చేలా బ్యాంకులో డబ్బు డిపాజిట్‌ చేస్తానని చెప్పారు. ఆ డబ్బు అతని జీవనోపాధి కోసం ఉపయోగపడుతుందన్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ పని చేస్తానన్నారు. ముగ్గురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకొని వెళ్లగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద కేవలం రెండు రోజుల్లోనే రూ. 5 లక్షలు చొప్పున ముగ్గురి కుటుంబాలకు అంద చేశారన్నారు.  

మరిన్ని వార్తలు