వైఎస్సార్‌ సీపీలోకి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి

18 Jan, 2020 16:04 IST|Sakshi

వైఎస్సార్‌ కడప: మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఏర్పాటుకు, నూతన భవన నిర్మాణాల కోసం భూమి పూజ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, డిసీసీబీ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడు నెలలకే ఇచ్చిన హామీలలో 80 శాతం నేరవేర్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మాత్రమేనని దక్కుతుందన్నారు. రాజధానిపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కృషి చేస్తున్నారని అన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అలా చేయకపోవడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి వదలుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో సీఎం జగన్‌ సమక్షంలో వెఎస్సార్‌సీపీలో చేరునున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. గత కొద్ది కాలంగా వీర శివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కమలాపురం టికెట్‌ను వీరశివారెడ్డి ఆశించినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచే వీరశివారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు.

చదవండి: బాబూ.. రేపు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచుతాం!

మరిన్ని వార్తలు