ఆ భూములను 1% సేకరించే వీలుంది

8 Jul, 2017 02:01 IST|Sakshi
ఆ భూములను 1% సేకరించే వీలుంది
భూసేకరణ ప్రక్రియపై స్టే విధించండి.. ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌
 
సాక్షి, న్యూఢిల్లీ: భూసేకరణ చట్టం–2013లోని నిబంధనలకు విరుద్ధంగా తన నియోజకవర్గ పరిధిలోని నాలుగు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రభుత్వం చేపట్టిందని, ఈ ప్రక్రియపై స్టే విధించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై హైకోర్టుకు వెళ్లగా స్టే ఇవ్వలేదని, కేవలం నోటీసు జారీచేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అమితావరాయ్‌లతో కూడిన ధర్మాసనం వద్దకు వచ్చింది.

తొలుత పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా స్పందిస్తూ ‘హైకోర్టులో జూలై 15న వస్తుందంటున్నారు కదా.. అక్కడే వాదనలు వినిపించండి. కేసులోని అంశాలపై మేం ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తంచేయడం లేదు. అక్కడ విచారణ ముగిస్తే న్యాయం కోసం మళ్లీ రావొచ్చు..’ అని పేర్కొన్నారు. పిటిషనర్‌ తరపున మరో న్యాయవాది రమేశ్‌ అల్లంకి విచారణకు హాజరయ్యారు. 
మరిన్ని వార్తలు