ఉద్యోగులేమైనా ఉగ్రవాదులా ?

20 Sep, 2018 13:23 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా

విజయపురం : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమలు చేస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. సీపీఎస్‌ రద్దు కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీని ప్రభుత్వం భగ్నం చేయడంపై బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల ద్రోహి అని.. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమేనని విమర్శించారు.

 సీపీఎస్‌ రద్దు కోరుతూ చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఉద్యోగులను ఉగ్రవాదుల్లాగా కొట్టి ఈడ్చుకెళ్లి అరెస్టు చేయించడం దారుణమన్నారు. ఉద్యోగులపై సర్కారు దమనకాండను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఇదే చంద్రబాబు 2003లో సీపీఎస్‌ను తీసుకొచ్చారని, వాటిని రద్దు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యోగస్తులను కొట్టడం చంద్రబాబుకు కొత్తేమి కాదని.. ఇది వరకే అంగన్‌వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామని, ఇది ఉద్యోగులు గుర్తించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు