బీజేపీతో చంద్రబాబు లాలూచి: ఎమ్మెల్యే రోజా

5 Jan, 2019 14:06 IST|Sakshi

సాక్షి, హైద్రాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి నాలుగేళ్లలో ఎన్నిచేయాలో అన్ని చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కూడా గౌరవించను అంటున్నారంటే చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. దొంగల్ని, ఆర్థిక నేరగాళ్లను కాపాడే అడ్డాగా ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు మార్చేశారని నిప్పులు చెరిగారు. 100 శాతం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబే చేయించారనడానికి, ఆయన మాటలే నిదర్శనమన్నారు. ఇదంతా ఆపరేషన్ గరుడ అని సినిమాలు లేని శివాజీ అనే నటుడితో చెప్పించారని ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అతన్ని ఎందుకు విచారించలేదని మండిపడ్డారు. 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మాట్లాడుతూ... 'చంద్రబాబు హిట్లర్‌లా, నియంతలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదు. మహిళను కాకినాడలో పట్టుకుని ఫినిష్ చేస్తానని గూండాలా బెదిరించారు. అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని బెదిరించారు. కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్ పోర్టులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డిని హత్య చేస్తే నేరం కేంద్రంపైకి పోతుందని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఎన్‌ఐఏ విచారణకి నిందితుడు శ్రీనివాస్‌కు లేని బాధ చంద్రబాబు, లోకేష్‌కు ఎందుకు? మీకు బాధ లేనపుడు ఆ కేసును ఎన్ఐఏకి అప్పగించాలి. రెస్టారెంట్‌ ఓనర్ హర్షవర్దన్ చౌదరి చంద్రబాబు బినామి. ఆ రెస్టారెంట్‌ను ప్రారంభించింది చంద్రబాబే. దాడికి ఉపయోగించిన కత్తి ఎంతో కాలంగా అక్కడ ఉంచారు.

ఎన్ఐఏకి కేసు అప్పగించాలని ఆ అధికారులు కోరితే రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదంట. హత్యాయత్నం వెనక ఉన్న వారు హర్షవర్దన్ చౌదరిగాని, శివాజి చౌదరిగాని అందర్ని బయటకు లాగాలి. వైఎస్‌ జగన్, బీజేపీతో కలసి కుట్ర చేస్తున్నారంటారు. బీజేపితో కలసి ఎన్నికలకు వెళ్లింది ఎవరు? ప్రభుత్వంలో కలసి పనిచేసింది మీరు కాదా? చంద్రబాబు ఎప్పటికి మా మిత్రుడే అని రాజ్‌నాథ్‌ సింగ్ లోక్ సభలో చెప్పారు. బీజేపీతో లాలూచి పడింది చంద్రబాబే. మోదీకి ఊడిగం చేస్తోంది చంద్రబాబే. ఏపీలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బీజేపీపై బురద జల్లి బయటకు వెళ్లడం మళ్లీ అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంది మీరు కాదా? మహారాష్ట్ర బీజేపి మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్ చేసింది మీరు కాదా? రేపు ఏమైనా కేసులు వస్తే ఆయనతో పనిచేయించుకోవడానికేనా? కేంద్రంపై యుధ్దం అని చెప్పి నీతి అయోగ్ మీటింగ్‌కు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టింది చంద్రబాబు కాదా? ఎన్టీఆర్ బయోపిక్‌కు క్లాప్ కొట్టింది వెంకయ్యనాయుడు కాదా? కర్ణాటక ఎన్నికలయ్యాక నన్ను అరెస్ట్ చేయబోతున్నారని, మీరు నన్ను రక్షించుకోవాలని ప్రజలను కోరలేదా? ఈరోజు వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు అంటే అర్థం ఏంటి? లాలూచి కాదా? శంకరర్రావు, ఎర్రన్నాయుడుతో కుమ్మక్కై కేసులు పెట్టించినా ధైర్యంగా వైఎస్‌ జగన్ ఎదుర్కొంటున్నారు.

కిడారి సర్వేశ్వరరావును హత్య చేస్తే ఎన్ఐఏకి అప్పగించింది మీరు కాదా? అది సమాఖ్య స్పూర్తికి విరుద్దం కాదా?  ఎమ్మెల్యేను రక్షించుకోలేని చేతకాని దద్దమ్మ చంద్రబాబు. కిడారి సర్వేశ్వరరావు కేసును బదిలి చేసినట్టే వైఎస్‌ జగన్ పై హత్యాయత్నం కేసు ఎందుకు ఎన్ఐఏకి ఇవ్వడం లేదు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోనివి అంటున్నారు. మరి మీ చుట్టు ఉన్న జెడ్ కేటగిరి భద్రత కేంద్రం కల్పించిందే కదా. వారిని నీ చుట్టు ఎందుకు ఉంచుకుంటున్నావు. వారిని పంపించేయి. తిరిగి అధికారంలోకి రాను అని భావించి చంద్రబాబు ఎయిర్ పోర్ట్‌లో భౌతికంగా వైఎస్‌ జగన్‌ను లేకుండా చేయడానికి ప్లాన్ చేసినా, భగవంతుడి దయ వల్ల ఆయన బయటపడ్డార'ని అన్నారు.

>
మరిన్ని వార్తలు