ప్రైవేట్‌ షుగర్స్‌ దోచుకుంటున్నాయ్‌

24 Oct, 2018 10:47 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కేరోజా

రైతుల్ని ఆదుకునేదెవరు?

ఎమ్మెల్యే ఆర్కేరోజా

చిత్తూరు, నగరి : ప్రైవేటు షుగర్‌ ఫ్యాక్టరీలు రైతులను దోచుకుంటున్నాయని ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. మంగళవారం నగరిలో పలు భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి దృష్టికి సమస్యలను తీసుకువచ్చారు. ప్రైవేటు షుగర్‌ ఫ్యాక్టరీలు రైతులను దోచుకుంటున్నాయని, ప్రభుత్వ షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడడమే ఇందుకు కారణమన్నారు. అనకాపల్లె షుగర్‌ ఫ్యాక్టరీకి రూ.30 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోని గాజులమండ్యం చెరుకు ఫ్యాక్టరీకి కూడా నిధులు మంజూరు చేసి, జిల్లా చెరుకు రైతులను ఆదుకోవడం లేదన్నారు. అక్కడ  పనిచేసే ఉద్యోగుల జీతం బకాయిలు కూడా ఇవ్వలేదని వాటిని అందించాలన్నారు.

చెరుకు రైతుకు కోస్తాలో టన్నుకు రూ.3500 వస్తుంటే ఇక్కడ రూ.2500 మాత్రమే ఇస్తున్నారన్నారు. పంట కాలిపోతే నష్టపరిహారం రావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎందరో ఉన్నారని వారికి ప్రోత్సాహం లేదన్నారు. వడమాలపేటకు చెందిన బాడీ బిల్డర్‌ హరికృష్ణకు తాను రూ.లక్ష ఇచ్చానని చెప్పారు. దీంతో అతను గోల్డ్‌మెడల్‌ సాధించాడన్నారు. ఇలా క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరెన్నో పథకాలు వస్తాయన్నారు. ఆ క్రెడిట్‌ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. కళాకారుడైన ఎన్టీఆర్‌ పేరు మీద స్టేడియం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడే 8 రోజుల పాటు వైఎస్సార్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించి పలువురు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. పలుచోట్ల మైదానాలు లేవని, నీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులు అందించాలని ఎంపీ శివప్రసాద్‌ను కోరారు.

అర్ధాంతరంగా వెనుదిరిగిన ఎమ్మెల్సీ
నగరి పట్టణంలో జరిగిన పలు ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ  అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అర్బన్‌ హౌసింగ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తరువాత జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. సీఎం చంద్రబాబు నగరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎవరినీ ప్రకటించకపోయినా, గాలి భాను ప్రకాష్‌ ఇన్‌చార్జిగా చెప్పుకుని తిరుగుతున్నాడని మంత్రి అమరనాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. గాలి భాను ప్రకాష్‌ వ్యవహారశైలి నచ్చకపోవడంతోనే ఎమ్మెల్సీ కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు

మరిన్ని వార్తలు