సర్వే పేరుతో ఓట్ల తొలగింపు

15 Nov, 2018 13:48 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి

కర్నూలు, ఆదోని టౌన్‌: సర్వే పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సూచించారు. ఆదోని పట్టణంలో బుధవారం సర్వే చేస్తున్న రెండు బృందాలను వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కొన్ని రోజులనుంచి  50 మంది  సర్వే చేస్తున్నారన్నారు. సర్వేలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సానుభూతిపరులని తేలితే  ఓట్లను తొలగిస్తున్నారన్నారు. సర్వే పేరుతో ఇళ్లవద్దకు వచ్చే వారికి ఎలాంటి వివరాలు చెప్పవద్దని, ఆధార్, రేషన్‌కార్డులు చూపమని అడిగితే తమవద్ద లేవని సమాధానంగా చెప్పాలని ప్రజలకు సూచించారు.  త్వరలో ఎన్నికలు వస్తున్నాయని,  టీడీపీకి ఓటమి  తప్పదని భావించే సీఎం చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఎవరైనా ఇంటివద్దకు వస్తే సమాచారం అందించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.  

సర్వే బృందంపై ఫిర్యాదు
సర్వే ముసుగులో ఓట్లను తొలగిస్తున్నారని టూ టౌన్‌ సీఐ భాస్కర్, వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాసులు, త్రీ టౌన్‌ సీఐ శ్రీరాములుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. సర్వే చేస్తున్న యువకులపై తమకు సమాచారం అందించాలని, విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐలు.. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు తెలిపారు. ఆదోని పట్టణం ప్రధాన రోడ్డులోని లాడ్జీల్లో ఉంటూ యువకులు సర్వే చేస్తున్న విషయాన్ని  వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ, మండల అధ్యక్షులు దేవా, నల్లారెడ్డి, యూత్‌ నాయకుడు శ్రీనివాసరెడ్డి తెలుసుకున్నారు. లాడ్జిలలోని యువకుల వద్దకు బుధవారం వెళ్లారు. ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ సంస్థ తరఫున  సర్వే చేస్తున్నారు.. ఐడీ కార్డు ఇవ్వాలని అడగగా..యువకులు ఎలాంటి ఆధారాలు చూపలేదు. దీంతో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచనల మేరకు  ఎలాంటి ఆధారాలు లేకుండా సర్వే చేసున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు