అవినీతి అనకొండ

9 Mar, 2019 08:42 IST|Sakshi
గూటాల ఇసుక ర్యాంపు నుంచి తరలిస్తున్న ఇసుక

అభివృద్ధి పనుల్లో కమీషన్ల దందా

మట్టి, ఇసుక ఇష్టారీతిన దోపిడీ

అంగన్‌వాడీ పోస్టులూ అమ్మకం

నాలుగున్నరేళ్లలో రూ. కోట్లకు

పడగలెత్తిన పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌

టాస్క్‌ఫోర్స్‌ : ఒకప్పుడు ఎర్రబస్సులో తిరిగిన సామాన్య వ్యక్తి.. గిరిజన కోటాలో ఎమ్మెల్యే కాగానే సంపాదన వెంట పరుగులు తీశారు. నాలుగున్నరేళ్లలోనే రూ.కోట్లకు పడగలెత్తారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. నియోజకవర్గం అభివృద్ధిపై కాకుండా, సొంత ఆస్తిపాస్తులు పెంచుకోవడంపైనే ఆయన దృష్టి పెట్టారు. అభివృద్ధి పనుల్లో కమీషన్లు దండుకున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ అంగన్‌వాడీ పోస్టులను సొమ్ములకు అమ్ముకున్నారు. ఆయనే పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌. ఈ ఎమ్మెల్యే రూ.150 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టీడీపీకి చెందిన సీనియర్‌ నేతలు ఆధారపూర్వకంగా ఫిర్యాదు చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలవరం మండలంలో గత నాలుగు సంవత్సరాల్లో ఇసుక మాఫియా పేరుతో కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల నాయకులు అక్రమంగా తరలించేశారు. పోలవరం, గూటాల ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను తరలించి రూ.కోట్లు దండుకున్నారు. పట్టిసం ఎత్తిపోతల పథకంలో స్థానిక ప్రజాప్రతినిధికి బాగానే గిట్టుబాటు అయ్యిందన్న ప్రచారం ఉంది. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌లు సుమారు రూ.3 కోట్లు విలువ గల స్థలాన్ని రాజమండ్రిలో కొనిచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

గోదావరి ఇసుకను ఇష్టానుసారంగా దోచేస్తున్నారు. ఇసుక పేదలకు భారంగా మారితే తెలుగు తమ్ముళ్లకు మాత్రం పాడికొండలా ఉంది. నిరుపేద ప్రజలు వేలాది రూపాయలతో ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది. కానీ అధికార పార్టీకి చెందిన నాయకులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ఇసుక రవాణాకు అధికారులతో అనుమతి గోరంత తీసుకొని కొండంతగా తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే మట్టి పరిస్థితి కూడా ఇదే. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌ రూ.150 కోట్లకు పైగా సంపాదించారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. పోలవరం మండలంలో నాలుగు సంవత్సరాల్లో ఇసుక మాఫియా పేరుతో కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల నాయకులు అక్రమంగా తరలించేశారు. పోలవరం, గూటాల ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను తరలించి రూ.కోట్లు దండుకున్నారు. ప్రధానంగా ఈ అక్రమ వ్యాపారంలో ఎమ్మెల్యేకు కూడా వాటా ఉంది. ఎన్నికల ఖర్చుల కోసం కొంత సొమ్ము మండలంలోని నాయకులు సిద్ధం చేసినట్టు సమాచారం.

పట్టిసంలో రూ.3 కోట్ల కమీషన్‌
పట్టిసం ఎత్తిపోతల పథకం ఏర్పాటులో స్థానిక ప్రజాప్రతినిధికి బాగానే గిట్టుబాటు అయ్యిందన్న ప్రచారం ఉంది. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌లు సుమారు రూ.3 కోట్లు విలువ గల కల్యాణ మండపానికి సరిపడే స్థలాన్ని బహుమతిగా ఇచ్చినట్టు  ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్థలాన్ని రాజమండ్రిలో కొనిచ్చారని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

వంద ఎకరాల భూముల కొనుగోలు
తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసే సమయంలో ప్రచారానికి కూడా డబ్బులు లేని పరిస్థితులను మొడియం శ్రీనివాసరావు ఎదుర్కొన్నారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. అయితే మొదటిసారిగా పదవి చేపట్టిన శ్రీనివాసరావు మూడేళ్లలో వంద ఎకరాలకు పైగా భూములను కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. భూమి అమ్మకం దారులకు ఇష్టంలేకున్నా బెదిరించి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఆ భూముల చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారని గిరిజనులు విమర్శిస్తున్నారు. అదేవిధంగా తన స్వగ్రామమైన రాజానగరం చుట్టూ విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌లు కోట్లాది రూపాయలతో నిర్మించారు. పేద వాడికి ఇళ్లు మంజూరు చేయడంలో కనీస శ్రద్ధ చూపని శ్రీనివాస్‌ తనకు మాత్రం గెస్ట్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకోవడం చర్చకు దారితీసింది.

ఔట్‌సోర్సింగ్, అంగన్‌వాడీ పోస్టుల అమ్మకం
తన నియోజకవర్గ పరిధిలోని ఔట్‌సోర్సింగ్, అంగన్‌వాడీ పోస్టులు అమ్మకానికి పెట్టి పోస్టుల భర్తీ చేసినట్టు శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత లేకున్నా సొమ్ములు ఇస్తే మాత్రం పోస్టులు వేయించారని దరఖాస్తు చేసుకున్నా ఉద్యోగం రాని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే కొంతమంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మరికొన్ని సొమ్ములు తీసుకొస్తే పర్మినెంట్‌ చేయిస్తామని అంటున్నట్టు  సమాచారం. ఇదిలా ఉండగా ఔట్‌ సోర్సింగ్‌లో డబ్బులిచ్చి ఉద్యోగంలో చేరిన వారిలో అనేక మందిని పోస్టుల నుంచి అధికారులు తొలగించినట్టు తెలిసింది. అయితే సొమ్ములిచ్చినా తొలగించారని సదరు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే సమాధానం చెప్పకపోగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.

తమ్ముడి పదవికి అన్న పెత్తనం
మొడియం శ్రీనివాస్‌ సోదరుడు రమణ ఐటీడీఏ పరిధిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తమ్ముడు ఎమ్మెల్యే పదవి చేపట్టిన తర్వాత ఐటీడీఏ ఉద్యోగులపై రమణ పెత్తనం ఎక్కువైనట్టు విమర్శిస్తున్నారు. ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌కు సంబంధించిన ఏ పోస్టయినా రమణ ప్రమేయంతోనే భర్తీ అవుతున్నాయి.

భూ సేకరణలో తెరవెనుక బాగోతం    
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులకు భూమికి భూమి, ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణకు పూనుకుంది. ఈ వ్యవహారం తెలుగు తమ్ముళ్లకు కోట్లు గడించిపెట్టింది. భూ సేకరణకు సంబంధించి ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు ఎకరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ముడుపులందాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలవరం భూ సేకరణలో సొంత పార్టీ నేతలకు భూమి లేకుండానే భూములకు డబ్బులు ఇప్పించార్నన ఆరోపణలున్నాయి. అంతేకాక భూములకు సంబం«ధించి పోలవరం భూ సేకరణలో ప్రత్యర్థుల భూములకు అవార్డు కాకుండా అడ్డుపడి రాజకీయంగా ప్రత్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.

నూటికి 10 శాతం కమీషన్‌
నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్లలో నాణ్యతాలోపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే ఏర్పాటు చేసుకున్న అధికారులు, తెలుగు తమ్ముళ్లకు నిర్మాణం పనుల బాధ్యతలు అప్పగించారు. అయితే అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో రోడ్డు నిర్మాణాలను ఇష్టానుసారంగా వేశారు. సుమారు రూ.150 కోట్లతో పనులు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో నూటికి 10 శాతం కమీషన్‌ ఇస్తేనే పనులు మంజూరు చేయడంతో పాటు బిల్లులు ఇచ్చేవారని తెలుగు తమ్ముళ్లు  చెబుతున్నారు. కమీషన్‌లు వసూలు చేయడంలో తన మన బేధం లేదని శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి.

అన్ని పనులు నామినేషన్‌పైనే..
కుక్కునూరు మండలంలో ఎమ్మెల్యే అండతో ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారు. ఇక్కడి పనులన్నీ నామినేషన్‌ పద్ధతిలోనే కానిచ్చేశారు. ఈ పనులను సొంత పార్టీ నేతలకు ఇప్పించుకున్న ప్రజాప్రతినిధి ప్రతి పనిలోనూ కమీషన్లు తీసుకున్నట్టు సమాచారం. పుష్కర పనుల్లో మండలానికి సంబం«ధించి మూడు పుష్కర ఘాట్లు మంజూరవ్వగా, ప్రతి పుష్కర ఘాట్‌ పనులను తన అనుచరులకు అప్పగించి నాసిరకం పనులు చేయించి భారీ మొత్తంలో డబ్బులు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా మండలంలో మంజూరైన సిమెంట్‌æ రోడ్డు పనులను తనకున్న అధికారంతో మండలంలోని సొంత పార్టీ నేతలకు ఇప్పించుకున్నారు. మండలం మొత్తం మీద సుమారు 2 కోట్ల రూపాయల పనులు చేపట్టగా రోడ్డు నిర్మాణం పూర్తైన రెండు నెలలు కూడా గడవకముందే రోడ్లు గుంతలు పడి పాడైపోయాయి. అదీ కాక అధికార పార్టీ నాయకుల ఇళ్లముందు అవసరం లేకున్నా సిమెంట్‌ రోడ్లు వేసి, అవసరం ఉన్న చోట వేయకుండా వదిలేశారు. ఇక టీడీపీ కుక్కునూరు మండల అధ్యక్షుడి ఇంటి ముందు వరకు సిమెంట్‌ రోడ్డు వేయించుకోవడం బట్టి అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేశారో అర్థం అవుతుంది. చిరవెల్లి చెరువులో పూడిక తీయకుండానే డబ్బులు దిగమింగినట్టు సమాచారం.

నాసిరకంగా పుష్కర పనులు
అధికార్ల అవినీతి, కాంట్రాక్టర్ల మితిమీరిన ధన కాంక్ష వెరసి పుష్కర పనుల్లో నాణ్యత కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పుష్కర పనుల్లో  నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలి తూతూమంత్రంగా పనులు చేపట్టి జేబులు నింపుకున్నారు. ఈ ముంపు మండలాల్లో పనులు ఎలా చేసినా ఎవరు పట్టించుకోరు. ఒక వేళవచ్చినా మాకేంటి వారికిచ్చే పర్సంటేజీలు ఇస్తున్నాం. అన్న ధోరణిలో కొంతమంది కా>ంట్రాక్టర్లు వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఈ రెండు మండలాల్లో ఆర్‌అండ్‌బీ, ఐబీ, పంచాయతీ రాజ్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మొత్తం రూ.6.97 కోట్ల పుష్కర నిధులతో పనులు చేపట్టారు. పదికాలాల పాటు పటిష్టంగా ఉండాల్సిన ఈ పనులు అధికారుల అవినీతి, అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. నిర్మాణ దశలోనే కొన్ని చోట్ల పుష్కర ఘాట్‌లు కుంగిపోయాయి. మరికొన్ని చోట్ల పెచ్చులుపెచ్చులుగా ఊడిపోయాయి. మెట్లు కూలిపోయాయి. రూ.1.40 కోట్ల వ్యయంతో వేలేరుపాడు మండలంలోని ఆటోస్టాండ్‌ సెంటర్‌ నుంచి  రుద్రమకోట, వసంతవాడ మీదుగా కుక్కునూరు మండలం కొర్లకుంట వరకు   10 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించిన కొద్దిరోజులకే కుంగిపోయింది. సరిగా  క్యూరింగ్, రోలింగ్‌ కూడా చేయలేదు. బీటీ మిక్స్‌ దూరం నుంచి తేవడం వల్ల వేడి తగ్గి పాళ్లు  సరిగా కలవకపోవడంతో రహదారంతా పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. ఈ రహదారికి ఇరువైపులా వేసిన సైడ్‌బరŠమ్స్‌లు కాంట్రాక్టర్‌ నల్లరేగడి మట్టితో నిర్మించడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

చెరువు పనుల్లో నిధుల దుర్వినియోగం
టి.నరసాపురం మండలంలో నీరు చెట్టు పథకంలో చెరువుల పూడికతీతకు 2016లో రూ.2 కోట్ల నిధులు  మంజూరు అయ్యాయి. ఈ నిధులతో మండలంలో 25 చెరువుల్లో పూడిక తీత పనులను  చేశారు. అయితే పనుల్లో నాణ్యత లేకపోవడం, అధికార టీడీపీ నాయకులు కాంట్రాక్టర్ల అవతారమెత్తి చెరువు పనులు పంచుకోవడంతో నిధులు దుర్వినియోగం అయ్యాయి. తూతూ మంత్రంగా చెరువు పనులు చేపట్టడం వల్ల పథకం నీరుగారిపోయింది. ఈ పనులు చేపట్టడానికి ముందే చెరువుల్లో రైతులు ఇళ్లకు తోలుకున్న మట్టికి సంబంధించి గోతులనే చదును చేసి నిధులు స్వాహా చేశారు. ఎమ్మెల్యే అండదండలతోనే చెరువు పనుల్లో అవినీతి చోటు చేసుకుంది. ఇందులో 70 శాతం నిధులతో టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారు.

సొంత పొలాలకు ప్రభుత్వ నిధులతో రోడ్లు
ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టవలసిన శ్రీనివాస్‌ తన స్వలాభంపైనే దృష్టి పెడతారన్న విమర్శలు ఉన్నాయి. గిరిజన ప్రాంతంలోని అనేక గ్రామాల్లో కనీస రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం రాజానగరం, పాత రాజానగరం గ్రామాల సమీపంలో ఉన్న తన పొలాలకు వెళ్లే మార్గాలకు రోడ్లు వేయించుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అదే విధంగా బుట్టాయగూడెం మండలంలోని ఇటుకులకుంట గ్రామ సమీపంలో కొనుగోలు చేసిన పొలాల సమీపంలోని కాలువకు మట్టి ఎత్తుగా వేయడం వల్ల వర్షాకాలం సమయంలో గ్రామస్తుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతురథంలోనూ చేతివాటం
చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు రథం ట్రాక్టర్‌ల పంపిణీ కార్యక్రమంలో కూడా భారీ వసూళ్లకు పాల్పడినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో మంజూరైన ట్రాక్టర్‌ కావాలంటే ఆ రైతుకు ఎమ్మెల్యే లెటర్‌ ద్వారానే అయ్యేదని, అనంతరం ఆ రైతు నుంచి సొమ్ములు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ రకంగా ఈ పథకంలో రూ.30 లక్షల వరకూ శ్రీనివాస్‌కు ముట్టినట్టు అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉన్న పరువు కాస్తా పాయే..!

పాఠశాల ఆవరణలో విద్యార్థికి పాముకాటు..

మత్స్యసిరి.. అలరారుతోంది

చెన్నూరు కుర్రోడికి ఏడాదికి రూ.1.24 కోట్ల జీతం

ఎంటెక్కు.. ‘కొత్త’లుక్కు 

కౌలు రైతుల కష్టాలు గట్టెక్కినట్లే

గంజాయి రవాణా ముఠా అరెస్ట్‌

దొంగ దొరికాడు..

వలంటీర్ల ఇంటర్వ్యూలకు.. ఉన్నత విద్యావంతులు  

దారుణం: భార్య, అత్తపై కత్తితో దాడి

అధికారం పోయినా ఆగని దౌర్జన్యాలు

జాక్‌పాట్‌ దగా..!

దారుణం: బాలిక పాశవిక హత్య

కమలంలో కలహాలు...

‘ఆత్మా’ కింద ఏపీకి ఐదేళ్లలో రూ.92 కోట్లు 

జీవో 5 ప్రకారమే ఏపీపీఎస్సీ ఎంపికలు 

పంచాయతీలకే అధికారాలు..

టెండర్లకు ‘న్యాయ’ పరీక్ష 

రివర్స్‌ టెండరింగ్‌లో 15 నుంచి 20 శాతం మిగులు

పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది

నాపై బురద జల్లుతున్నారు

ప్రతిభావంతులకే కొలువు

విద్యుత్‌ కొనుగోళ్లలో అంతులేని అవినీతి

మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగు

ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌గా చల్లా మధుసూధన్‌

23న బెజవాడకు గవర్నర్‌ విశ్వభూషణ్‌

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి డా. దనేటి శ్రీధర్‌ విరాళం

ఈనాటి ముఖ్యాంశాలు

ఆత్మా పథకం కింద ఏపీకి రూ. 92 కోట్లు

బీసీలకు ఏపీ సర్కార్‌ బంపర్‌ బొనాంజా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌