-

వన్యప్రాణి వేటగాళ్లకు ఎమ్మెల్యే అండ?

22 Oct, 2014 01:42 IST|Sakshi
వన్యప్రాణి వేటగాళ్లకు ఎమ్మెల్యే అండ?

కళ్యాణదుర్గం : వన్యప్రాణిని వేటగాళ్లకు స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అండదండలున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. గత శనివారం శెట్టూరు మండల పరిధిలోని మాలేపల్లి అటవీ ప్రాంతంలో జింకను వేటాడుతూ 14 మంది ఆ మండల ఎస్‌ఐ వెంకటరమణకు పట్టుబడ్డారు. ఆ సమయంలో నిందితుల నుంచి రెండు తపంచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ కేసులో పట్టుబడ్డ వారిలో కళ్యాణదుర్గం కొత్తూరుకు చెందిన తొమ్మిది మంది టీడీపీ సానుభూతిపరులు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే పోలీస్ స్టేషన్‌ను చేరుకుని టీడీపీ మద్దతుదారులను కేసు నుంచి తప్పించాలని ఎస్‌ఐతో చర్చించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొంచిన ఎస్‌ఐ  ఐదుగురిపై మాత్రమే కేసు నమోదు చేశారు.

వీరిలో ముగ్గురు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం.  కాగా, జింక కలేబరానికి పశు వైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండగా శెట్టూరు పశువైద్యశాల అటెండర్ రాధమ్మ సమక్షంలో తంతు ముగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసును పక్కదారి పట్టించడంలో రూ. లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా, ఘటనకు సంబంధించి పోలీసులకు పట్టుబడ్డ ఐదుగురిపైనే కేసు నమోదు చేసినట్లు అటవీశాఖ అధికారి రాఘవయ్య పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎస్‌ఐ వెంకటరమణ తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు