బోగస్‌ ఓట్లపై చర్యలు తీసుకోండి

23 Feb, 2019 12:18 IST|Sakshi
ఎమ్మెల్యే సతీమణి జి.నిర్మలదేవి పేరున రెండు చోట్ల ఉన్న ఓటు

ధర్మవరం నియోజకవర్గంలో తప్పులతడకగా ఓటరు జాబితా

ఎమ్మెల్యే సతీమణికి రెండు చోట్ల ఓటు

6 వేలకు పైగా బోగస్‌ ఓట్లు

కేంద్ర ఎన్నికల కమిషన్‌ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫిర్యాదు

అనంతపురం అర్బన్‌: ‘ధర్మవరం నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తప్పులతడకగా సిద్ధం చేశారు. బోగస్, వివాహం చేసుకుని వెళ్లిన వారు, రెండు ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు జాబితాలో 6,073 ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ సతీమణి జి.నిర్మలదేవికి రెండు చోట్ల ఓటు ఉంది.  రెవెన్యూ అధికారులు ఏళ్లగా పనిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా వారిని ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు. వీటన్నింటిపైన ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అ«ధికారికి 20 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.’ అని కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి మలయ్‌మాలిక్‌కు ధర్మవరం మాజీ ఎమ్మల్యే, వైఎస్సార్‌సీపీ నియోజవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాలపై విచారణ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి మలయ్‌మాలిక్, సెక్షన్‌ ఆఫీసర్‌ రవి శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో చేపట్టిన విచారణకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరై... ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులను ఆధారాలతో సహా అందజేశారు. అధికారులను అధికారపార్టీ ఏవిధంగా ప్రలోభపెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెట్టి తప్పుడు ఓట్లను నమోదు చేయిస్తోంది వివరించారు.  కలెక్టర్‌ జి.వీరపాండియన్, జేసీ–2 హెచ్‌.సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ధర్మవరం, అనంతపురం ఆర్‌డీఓలు తిప్పేనాయక్, కూర్మనాథ్‌ ఉన్నారు.

వెంకటరామిరెడ్డి ఫిర్యాదు ఇలా..
ఓటర్ల నమోదుకు 2018, సెప్టెంబరు నుంచి అక్టోబరు 31 వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ వ్యవధిలో ఓటరు నమోదుకు 18,429 దరఖాస్తులు వచ్చాయి. సరైన విచారణ నిర్వహించకుండా 5,988 దరఖాస్తులు ఆమోదించారు.
స్థానిక ఎమ్మెల్యే సతీమణి జి.నిర్మలదేవికి రెండు చోట్ల ఓటు ఉంది. పోలింగ్‌ బూత్‌ 134లో (సీరియల్‌ నంబర్‌ 620) ఒక ఓటు, బూత్‌  230లో (సీరియల్‌ నంబరు 552) మరో ఓటు ఉంది.
ఎం.పి.సుబ్బారావు అనే వ్యక్తికి 108 బూత్‌లో (491), 218 బూత్‌ నంబర్‌లో (771) మరో ఓటు ఉంది. రమేశ్‌బాబు అనే వ్యక్తికి బూత్‌ నంబర్‌ 1లో (34) ఒక ఓటు, అదే బూత్‌లో(443) మరో ఓటు ఉంది. జి.నరసింహులుకు బూత్‌ నంబర్‌ 1లో (373) ఒక ఓటు, అదే బూత్‌లో (605) మరో ఓటు ఉంది. ఇలా బోగస్‌ ఓట్లు 6 వేల వరకు ఉన్నాయి.
బోగస్‌ ఓట్ల తొలగింపునకు బీఎల్‌ఓలు సిఫారసు చేసినా ఏఈఆర్‌ఓలు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వాటిపై 9,495 దరఖాస్తులు దాఖలు చేస్తే కేవలం 5,328 ఆమోదించారు.
తొలగింపులకు సంబంధించి ఫారం–7లో దరఖాస్తు చేస్తే వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలకు సమాచారం ఇవ్వకపోగా కనీసం విచారణ చేయలేదు. పైపెచ్చు దరఖాస్తులు తిరస్కరించారు.
అధికారపార్టీ ఒత్తిళ్లకు తట్టుకోలేక మునిసిపల్‌ కమిషనర్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దారు సెలవుపై వెళ్లారు. బోగస్‌ ఓటర్లను నమోదు చేయాలని బీఎల్‌ఓలు, ఏఈఆర్‌ఓలపై ఒత్తిడి చేస్తున్నారు. అలా చేయని పక్షంలో సెలవుపై వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు.
ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బోగస్‌ ఓట్ల విషయంపై సీఈఓ, డీఈఓకు 20 సార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. ఈ ఏడాది జనవరి 11న తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. అయినా వేల సంఖ్యలో బోగస్, డూప్లికేట్‌ ఓట్లు అలాగే ఉన్నాయి.
ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బోగస్‌ ఓట్ల చేర్చడంపై బీఎల్‌ఓ, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓలు, జిల్లా ఎన్నికల అధికారిని విచారణ చేయాలి. ఇందులో బాధ్యులైన వారందరిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.
కొందరు రెవెన్యూ అధికారులు దీర్ఘకాలికంగా జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోæ వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వారిని యథావిధిగా జిల్లాలోనే కొనసాగిస్తూ ఎన్నికల విధులు అప్పగించారు. 

ఎమ్మెల్యే సూరి భార్యకు రెండు చోట్ల ఓటు
ఈమె పేరు జి.నిర్మలాదేవి. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సతీమణి. పట్టణంలో డబ్ల్యూఏయూ 316364, ఇంటి నెంబర్‌ 2–1, డబ్ల్యూఏయూ 1222975, ఇంటి నెంబర్‌ 25–585 పేరిట రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ఈ ఉదాహరణను పరిశీలిస్తే.. స్థానికంగా దొంగ ఓట్ల నమోదు ఏ స్థాయిలో సాగిందో అర్థమవుతోంది.

మరిన్ని వార్తలు