ఎమ్మెల్యే వెంకట్రావ్‌కు తీవ్ర అస్వస్థత

10 Jun, 2014 02:30 IST|Sakshi

విజయవాడ: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తారని కాగిత భావించారు. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఆయన అనుచరులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  పదవీ త్యాగాలకు సిద్ధపడ్డారు. ఆదివారం చంద్రబాబు ప్రమాణస్వీకార సభకు వెళ్లవద్దని పట్టుబట్డారు. ఈ పరిస్థితుల్లో వెంకట్రావ్ ఒత్తిడికి లోనుకావడంతో బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి. సోమవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు విజయవాడలోని హార్ట్‌కేర్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు.

జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అడిగి వెంకట్రావ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారని  ఉమామహేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నిన్నటి నుంచి వెంకట్రావ్ ఆహారం తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన వెంకట్రావ్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆయన అభిమానులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు