ఎంపీడీవోపై ఎమ్మెల్యే ఆగ్రహం

31 Oct, 2019 09:06 IST|Sakshi

సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : అవినీతిని ప్రోత్సహిస్తారా...ప్రభుత్వం ఓ వైపు అవినీతి రహిత పాలన అందించాలంటుంటే, మీరు అక్రమ వసూళ్లకు పాల్పడతారా? అంటూ చిలకలూరిపేట ఎంపీడీవో పి.శ్రీనివాస పద్మాకర్‌పై ఎమ్మెల్యే విడదల రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పంచాయతీ కార్యదర్శుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అక్రమంగా బిల్లులు పెట్టించి అవసరానికి మించి నిధులను డ్రా చేసుకుంటున్నారని కొంతకాలంగా ఎంపీడీవోపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులను పిలిచి మాట్లాడారు.

ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్యే ముందు గోడు వెళ్లబోసుకున్నారు. పంచాయతీల నుంచి అక్రమంగా నిధులు డ్రా చేసి తనకు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీడీవోపై ఫిర్యాదు చేశారు. మాట వినకున్నా, చెప్పింది చెప్పినట్లు చేయకున్నా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఉద్యోగాలు తీయించి వేస్తానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన నెలరోజుల వ్యవధిలో తమ వద్ద నుంచి రూ.1.8 లక్షలు అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. ఇదే సందర్భంలో అక్కడకు వచ్చిన ప్రజలు సైతం డబ్బులు చెల్లించనిదే ఏ పని చేయడంలేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న ఓ కాంట్రాక్టర్‌ రూ.2 లక్షలు విలువైన పనులు నిర్వహించి రూ. 5లక్షలకు బిల్లు పెట్టాలని తనకు ఎంపీడీవో చెప్పారని ఆరోపించారు. బిల్లు అయ్యాక మిగిలిన రూ.3 లక్షలు తనకు తెచ్చి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదు చేశారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీవోపై ఎమ్మెల్యే విడదల రజని జెడ్పీ సీఈవో డి.చైతన్యకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తగు చర్యలు తీçసుకుంటామని సీఈవో ఫోన్లో ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు