అనుభవం మోసాన్ని పసిగట్టలేకపోయిందేం?

1 Jul, 2018 09:31 IST|Sakshi

నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు

రాష్ట్ర ప్రజలను వంచించిన మోదీ, బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు

రేపు అనంతపురంలో వంచనపై గర్జన దీక్ష

విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: ‘‘రాష్ట్రాన్ని పాలించడంలో తనకు అపారమైన అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మోసగించిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. నాలుగేళ్ల పాటు కేంద్రాన్ని భుజానికెత్తుకుని ఎన్నికల వేళ ప్రజల ముందు మొసలి కన్నీరు కార్చడం ఆయనకే చెల్లు. నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని గొప్పగా చెప్పుకునే ఆయన అనుభవం ప్రత్యేక హోదాను సాధించడంలో ఏమైంది.’’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనను ప్రజలకు తెలియజెప్పేందుకే ఈనెల 2న అనంతపురంలో ‘వంచనపై గర్జన దీక్ష’ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులు, తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన తాజా మాజీ ఎంపీలు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు దీక్షలో పాల్గొంటారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు గత నాలుగేళ్లుగా తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారన్నారు. హోదా అంశం ఇప్పటికీ సజీవంగా ఉందంటే అది తమ నేత అంకితభావం వల్లేనన్నారు.

29 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించిందేమి చంద్రబాబు
ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 29 సార్లు డిల్లీకి వెళ్లారని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా చెప్పుకుంటున్నారని, అయితే ఆయన ఏమి సాధించారో ప్రజలకు వివరించాలన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కేంద్రాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయని విధంగా మోదీ సర్కారు అభివృద్ధి చేసిందని చెప్పిన నోటితోనే ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడగటం వెనుక దురుద్దేశం ప్రజలకు తెలియనిది కాదన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడన్నారు.

ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ పోరు ఉద్ధృతం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు ప్రాణాలకు తెగించి పోరాడుతామన్నారు. ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలతో పాటు కేంద్రంపై అవిశ్వాసం కుడా ప్రవేశపెట్టామన్నారు. ఐదుసార్లు రాష్ట్ర బంద్‌లు, ఎంపీల రాజీనామాతో వైఎస్సార్‌సీపీ పోరాటం ప్రజలను ఆలోచింపజేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తేజోనాథ్, చేనేత విభాగం రాష్ట్ర నాయకులు మిడతల చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఈడిగప్రసాద్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు