ఎకరాకు రూ. 70వేలు ఇవ్వాలి

7 May, 2018 12:54 IST|Sakshi

రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం

అరటి విత్తన మొక్కలను ప్రభుత్వమే ఇవ్వాలి

ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌ రెడ్డి

సాక్షి, అనంతపురం : పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్సార్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం బెలుగుప్ప మండలంలోని రామసాగరం,  దుద్దేకుంట గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న అరటి, మామిడి తోటలను ఆయన పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వెయ్యి హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. పంట నష్టానికి గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, గత ఏడాదిలో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 70వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని విశ్వేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫమైందని ధ్వజమెత్తారు. గత కొద్ది కాలంగా అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వమే ఉచితంగా విత్తన మొక్కలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందంటూ విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు