రెగ్యులర్‌ పోస్టులు కాదు.. టైమ్‌ స్కేలే!

28 Jul, 2018 03:23 IST|Sakshi

అదీ 33 మందికే వర్తింపు

ఎమ్మెల్సీల కమిటీ నివేదిక

మిగిలిన వారికి విద్యావలంటీర్లుగా అవకాశం

డీఎస్సీ–98 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు నిరాశే

ఎన్నికల హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు  

సాక్షి, అమరావతి: డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. వీరికి న్యాయం చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని ప్రభుత్వం ఏదో విధంగా నీరుగార్చే పరిస్థితి కనిపిస్తోంది. టీచర్‌ ఎమ్మెల్సీలతో ప్రభుత్వం నియమించిన కమిటీ.. అప్పట్లో క్వాలిఫైడ్‌ అయిన అభ్యర్థుల్లోని  కేవలం 33 మంది మాత్రమే టైమ్‌ స్కేలుకు అర్హులని తేల్చుతూ ప్రభుత్వానికి తాజాగా ఇచ్చిన నివేదికలో పేర్కొంది. మిగతా వారిని విద్యావలంటీర్లుగా అవకాశం కల్పిస్తే సరిపోతుందని ఆ నివేదికలో పొందుపరిచారు.  

సుదీర్ఘకాలం ఎదురుచూపులు
1998లో మొత్తం 36,136 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. అప్పట్లో డీఎస్సీలో 85 మార్కులకు పరీక్ష, 15 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులకు ఎంపిక చేసే విధానాన్ని అమలుచేశారు. అర్హత మార్కుల కింద ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులు రావాలని నిబంధన పెట్టారు. ఆ డీఎస్సీ రాత పరీక్షల్లో 18 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. పోస్టులకన్నా అర్హులైన అభ్యర్థులు తక్కువగా ఉండడంతో అప్పట్లో  ప్రభుత్వం అర్హత మార్కులను 5 చొప్పున అన్ని కేటగిరీల్లోనూ తగ్గించింది. అలా తగ్గించాక మరికొందరు అభ్యర్థులు అర్హత సాధించారు.

అప్పట్లో ఈ అభ్యర్థులకు పోస్టుల కేటాయింపులో అనేక అవతకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంటర్వ్యూల్లో తమకు కావాల్సిన వారికి ఎక్కువ మార్కులు వేసి.. వారికి ఉద్యోగాలు వచ్చేలా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. రాత పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి తీరని అన్యాయం జరిగింది. దీనిపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా రాత పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పింది. దీన్ని సవాల్‌ చేస్తూ అప్పటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు.. అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వెలువరించినా దాన్ని అమలు చేయకుండా తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అర్హులైన అందరికీ ఉద్యోగాలు ఇచ్చామని, తక్కిన పోస్టులకు అర్హులు లేనందునే అర్హత మార్కులు తగ్గించామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అందరికీ పోస్టులు ఇవ్వకుండానే ఇలా కోర్టుకు తెలియచేయడాన్ని సవాల్‌ చేస్తూ అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అందరికీ ఉద్యోగాలివ్వాలని ట్రిబ్యునల్‌ 2009లో తీర్పు ఇవ్వగా.. విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఆ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాల్సిందేనని.. పాత తేదీల నుంచి నియమిస్తూ అప్పటి నుంచి వేతన బకాయిలు కూడా చెల్లించాలని 2011లో మళ్లీ హైకోర్టు స్పష్టంచేసింది.

అయినా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయడం, ఆ డీఎస్సీ ముగిసినందున పోస్టులు లేవని ప్రభుత్వం చెప్పడంతో ధిక్కార పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనిపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పు సరికాదంటూ.. అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇలా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అభ్యర్థులకు రెండు దశాబ్దాలుగా పోస్టులు మాత్రం దక్కలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికలు ముందు వీరికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పలుమార్లు ఆయనను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఉద్యోగాలు రాక పలువురు అభ్యర్థులు ఆత్మహత్యలకూ పాల్పడ్డారు.


వీళ్లకు ఇస్తే.. వాళ్లూ అడుగుతారు
అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం కేవలం 33 మంది మాత్రమే అర్హులున్నట్లు తేలింది. వారికి కూడా రెగ్యులర్‌ పోస్టులు ఇచ్చేందుకు వీలుకాదు. అలా ఇస్తే ఆ తర్వాత డీఎస్సీలో క్వాలిఫై అయిన వాళ్లూ అడుగుతారు. అందుకే ఈ 33 మందికి మాత్రమే టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలన్నాం. తక్కిన వారిని విద్యావలంటీర్లుగా తీసుకుంటారు.  – గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్సీ కమిటీ సభ్యుడు


కమిటీ నివేదిక అశనిపాతం
అభ్యర్థులకు న్యాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించి.. పాఠశాల విద్యాశాఖ ద్వారా ఎమ్మెల్సీలతో కమిటీని నియమించారు. 13 జిల్లాల్లో.. 4,535 మంది అర్హులైన అభ్యర్థులున్నారని, వీరికి టైమ్‌ స్కేల్‌ ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించింది. మే 30న ప్రభుత్వానికి నివేదికను అందించింది.

అయితే టైమ్‌స్కేలుకు నిర్ణయించిన అభ్యర్థుల జాబితాలోనూ ఆ తర్వాత కోతపడింది. అప్పట్లో క్వాలిఫైడ్‌ అయిన అభ్యర్థుల్లో కేవలం 33 మందే టైమ్‌ స్కేలుకు అర్హులని తాజాగా తేల్చింది. మిగతా వారిని విద్యావలంటీర్లుగా అవకాశం కల్పిస్తే సరిపోతుందనడం అభ్యర్థుల పాలిట అశనిపాతంగా మారుతోంది. అయితే ఈ కమిటీ సూచనలను అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు