'సత్యం' వద్దు

5 Jun, 2015 07:58 IST|Sakshi
'సత్యం' వద్దు

సిఫార్సు చేయడానికి నారాయణెవరు
స్థానిక నేతనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాలి
అధిష్టానానికి టీడీపీ నేతలు ఘాటుగా విజ్ఞప్తి

 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ఎవరీ నెల్లిమర్ల సత్యం’. ఊరు పేరు తెలియని వ్యక్తిని ఎమెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడమేంటి?  పార్టీ కోసం కష్టపడి పనిచేసినోళ్లని కాకుండా ఈ ప్రాంత వాసి అని ఎక్కడి నుంచో తీసుకు రావడమేంటి? అసలు నారాయణెవరు? ఆయన వ్యవహారాల్ని చూసుకునే వ్యక్తిని మాపైకి దించుతారా..? పదేళ్ల కష్టపడ్డ వాళ్లని కాకుండా దిగుమతి చేసిన గుర్తు తెలియని వ్యక్తిని ఎమ్మెల్సీగా నిలబెడతారా?’’ అంటూ టీడీపీ జిల్లా నేతలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇంతవరకు ‘సత్యం’ ముఖమే చూడలేదని, ఆయనెలా ఉంటారో తెలియదని, అలాంటి వ్యక్తి కోసం ఎన్నికల్లో ఎలా పనిచేయగలమని అంతర్మథనం చెందుతున్నారు.
 
 ఇవన్నీ ప్రస్తావిస్తూనే  అల్టిమేటం మాదిరిగా  అధిష్టానానికి తమ ఆవేదనతో పాటు విజ్ఞప్తిని తెలియజేస్తున్నారు. సత్యం వద్దని, స్థానిక నేతనే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం శోభా హైమావతి, తెంటు లక్ష్ముంనాయుడు, కె.త్రిమూర్తులరాజు, గద్దే బాబూరావు, ఐవీపీరాజు, తూముల భాస్కరరావు, మహంతి చిన్నంనాయుడు, డాక్టర్ వి.ఎస్.ప్రసాద్, సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు ఆశిస్తున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకున్నారు. వేర్వేరుగా అధినేతల్ని కలిశారు. కొందరు చంద్రబాబుని, మరికొందరు లోకేష్‌ని, ఇంకొందరు మంత్రి నారాయణని కలిశారు. కానీ వీరిని కాదని పార్టీ అధిష్టానం ‘నెల్లిమర్ల సత్యం’ పేరును పరిశీలించడమే కాకుండా సూచన ప్రాయంగా అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసింది. దీంతో అసలీ సత్యం ఎవరు అనేదానిపై ఆరాతీశారు. మంత్రి నారాయణకు సంబంధించిన వ్యక్తి అని గుర్తించారు.
 
 ఆయన  వ్యాపార, ఆర్థిక లావాదేవీల భాగస్వామిగా భావించడమే కాకుండా గతంలో నెల్లిమర్లలో ఉండేవారని, భోగాపురంలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, ఎంతైనా పార్టీకి ఇచ్చుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని నిర్థారణ చేసుకున్నారు. మంత్రి నారాయణ సిఫార్సుల మేరకు అధిష్టానం పరిశీలించి ఉండొచ్చని, గతంలో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ విషయంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని అభిప్రాయానికొచ్చారు.  అసలు నారాయణకు ఏం సంబంధం? అంటూ మూకుమ్మడిగా సత్యం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయమై అశోక్ బంగ్లాలో జిల్లా ముఖ్య నాయకులంతా సమావేశమైనట్టు కూడా సమాచారం.
 

మరిన్ని వార్తలు