ప్రజలంతా గమనిస్తున్నారు

23 Jul, 2018 08:01 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి

చాగలమర్రి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరు చిత్తశుద్ధితో పోరాడుతున్నారో... ఎవరు పూటకో మాట మారుస్తున్నారో ప్రజలు అంతా గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రత్యేక హోదా కోరుతూ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాబులాల్, మండల కన్వీనర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో చాగలమర్రిలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్సీ, పార్టీ నియోజకవర్గ నేత గంగుల నాని పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ  నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ప్రత్యేక హాదా వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని నేటికీ పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక హాదా వద్దని ప్యాకేజీయే ముద్దని మొన్నటి వరకు ప్రకటించారు. హోదా కావాలని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేస్తే వారిని జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబుదేనన్నారు.

బీజేపీతో కొన్ని విషయాల్లో సర్దుబాటు గాక హోదాపై యూ టర్న్‌ తీసుకొని ప్రస్తుతం హోదా ఉద్యమాన్ని తామే భుజాన వేసుకొని మోస్తున్నామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీతో అన్నీ వస్తాయని ఆనాడు బీజేపీ నాయకులకు సన్మానం చేయలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక ప్యాకేజీని మెచ్చుకున్న చంద్రబాబు..నేడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటం, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆదరణ పెరుగుతుండటంతో హోదా పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తే వారికి సహకరించకుండా, నేడు అవిశ్వాసం పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు.

చివరికి ప్రధానమంత్రి కూడా మీరడిగితేనే ప్యాకేజీ ఇచ్చామని, ఇప్పుడు పరిస్థితుల ప్రభావమంటూ మాట మారిస్తే ఎలా అన్నారన్నారు. రాష్ట్రం పురోభివృద్ధి చెందాలంటే వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 24వ తేదీన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మాబుషరీఫ్, ఉపసర్పంచ్‌ అబ్దుల్లాబాషా, నాయకులు శింగం భరత్‌కుమార్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, కొలిమి హుసేన్‌వలి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు