ఎమ్మెల్సీగా హ్యాట్రిక్ అవకాశం

17 Mar, 2015 03:08 IST|Sakshi

మడకశిర : నియోజకవర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామికి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్సీ పదవి దక్కించుకునే అవకాశం లభించింది. ఇప్పటికే అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా హ్యాట్రిక్ కొట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని బలోపేతం చేశారు.

ఈ సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించి సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవికి గుండుమల తిప్పేస్వామిని ఎంపిక చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు గుండుమల తిప్పేస్వామి రెండు సార్లు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు.

2006లో మొదటి సారిగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ రోజు కొత్తగా శాసన మండలిని పునరుద్ధరించారు. దీంతో లాటరీ పద్ధతిలో తిప్పేస్వామికి రెండేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం వచ్చింది. మళ్లీ ఆ తర్వాత 2009లో కూడా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. మూడో సారి టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గుండుమల తిప్పేస్వామిని పోటీకి పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళవారం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా గుండుమల నామినేషన్ దాఖలు చేయనున్నారు.
 
అంచెలంచెలుగా ఎదిగిన గుండుమల
మడకశిర మండల పరిధిలోని గుండుమల గ్రామానికి చెందిన తిగళప్ప, బాలమ్మల కుమారుడు జి.తిప్పేస్వామి. యాదవ సామాజిక వర్గానికి చెందిన తిప్పేస్వామి 1987 కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రస్తుత ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అనుచరుడుగా కొనసాగుతూ వివిధ పదవులను అలంకరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మంది అభ్యర్థులను, ఎమ్మెల్యేను గెలిపించుకున్నారు.
 
 బయోడేటా
 పేరు : గుండుమల
         తిప్పేస్వామి
 విద్యార్హతలు : బీఎస్సీ,     
      ఎల్‌ఎల్‌బీ
 పుట్టినతేదీ : 03.01.1960
 రాజకీయ ప్రవేశం : 1987
 చేపట్టిన పదువులు
  2001లో రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు
  జనవరి 2005 జెడ్పీ చైర్మన్
  మార్చి 2007 ఎమ్మెల్సీగా మొదటిసారి
  ఏప్రిల్ 2009 ఎమ్మెల్సీగా రెండో సారి
  జూన్ 2010 అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా మొదటి సారి
  జూన్ 2012 అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా రెండో సారి
  మార్చి 15, 2014లో టీడీపీలోకి చేరిక
  మార్చి 2015లో
     అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా
      మూడోసారి నియాకం

మరిన్ని వార్తలు