ఏపీ గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు

2 Dec, 2019 15:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌ భాస్కర్‌ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే తొలగించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. ప్రోగ్రెసివ్‌ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం ఐదుగురు ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఏపీపీఎస్సీ, యూరేనియం తవ్వకాలకు సంబంధించిన అంశాలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ  ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లల్లో ఆయన తీరు వల్ల లక్షలాది అభ్యర్థులు అవస్థలు పడ్డారని విమర్శించారు. ఆయన ఇష్టానుసారంగా ప్రతి ఏడాది సిలబస్ మార్చేశారని మండిపడ్డారు.

గ్రూపు 1, గ్రూపు 2, గ్రూపు 3 పరీక్షల సిలబస్‌కు.. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సంబంధం లేదని, అన్నీ  తప్పులే ఉన్నాయన్నారు. నెగిటివ్ మార్కులు వల్ల  గ్రామీణ ప్రాంత అభ్యర్ధులు నష్టపోయారని గుర్తు చేశారు. ఈ అంశాలపై గవర్నర్‌కు ఆధారాలతో సహా వివరించామని వెల్లడించారు. ఈస్టర్ పండుగ రోజు కూడా పరీక్ష నిర్వహించారని తప్పుపట్టారు. ఛైర్మన్ ఉదయ భాస్కర్‌ను  వెంటనే తొలగించి  అభ్యర్థులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు.

ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఏపీలో యురేనియం తవ్వకాల వల్ల ప్రకృతికి  ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. కడప, నెల్లూరు జిల్లాల్లో ఈ తవ్వకాల వల్ల  చెరువుల్లో నీరు కలుషితం అవుతుందని విమర్శించారు. ఈ విషయమై అధ్యయనం చేసి ఒక యూనివర్శిటీ నివేదిక ఇస్తే.. అది బయటకురాకుండా ఆపేశారని మండిపడ్డారు. ఎలాంటి యురేనియం తవ్వకాలకు  అనుమతి ఇవ్వకుండా‌ చూడాలని గవర్నర్‌ను కోరినట్లు ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

మరిన్ని వార్తలు