'ఒంటరిగానే బలమైన శక్తిగా ఎదుగుతాం'

4 Sep, 2019 19:10 IST|Sakshi

ఎమ్మెల్సీ మాధవ్‌

సాక్షి, విజయవాడ : మేము ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేమని, ఒంటరిగానే బలమైన శక్తిగా ఎదుగుతామని బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్‌ మాధవ్‌ పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని, పోలవరం విషయంలో విచ్చల విడిగా అవినీతి జరిగిందని మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రే పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని అన్నారని విమర్శించారు. టీడీపీ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపిస్తే దానికి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక వైఎస్‌ జగన్‌ 100 రోజుల పాలనలో చిత్తశుద్ది కనిపిస్తుందని, నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలనకు సీఎం జగన్‌ పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం  అసెంబ్లీలో 19 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు త్వరగతిన పూర్తి చేసేలా త్వరలోనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తామని మాధవ్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు