ఎమ్మెల్సీ సీటు కేటాయింపుపై ఉత్కంఠ

13 Jun, 2015 02:58 IST|Sakshi

- వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు ఒక సీటు ఖరారు?
- బచ్చుల అర్జునుడు, బుద్దా మధ్య పోటీ
సాక్షి, విజయవాడ :
కృష్ణాజిల్లా స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలకుమించిన భారంగా మారింది. రెండు సీట్లకు ముగ్గురు మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. అయితే, ఒక సీటును ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసి, స్థానిక సంస్థల్లో మంచిపట్టున్న వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌కు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇక రెండో సీటును ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఉన్నతస్థాయిలో తర్జనభర్జన జరుగుతోంది. ఈ అంశం శుక్రవారం రాత్రి వరకు ఒక కొలిక్కి రాలేదు. శనివారం  తప్పనిసరిగా  ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జిల్లా నేతల్లో ఈ సీటు కేటాయింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

నగరానికి ప్రాధాన్యత ఇవ్వరా?
బుద్దా వెంకన్న కోసం నగరంలోని టీడీపీ నాయకులంతా ఏకమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)తో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు బుద్దా వెంకన్నకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి సరైన ప్రాతినిధ్యం లేదని, అందువల్ల ఆ సీటును బుద్దా వెంకన్నకు ఇస్తే అక్కడ పార్టీ బలపడుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే శాసనమండలిలో ముగ్గురు యాదవ సామాజికవర్గ సభ్యులు ఉన్నందున బచ్చులకు బదులు తమ వర్గానికి చెందిన బుద్దాకు అవకాశం కల్పించాలని గౌర కులస్తులు కోరుతున్నట్లు తెలిసింది.

బందరు పార్లమెంట్ పరిధిలోనూ, తూర్పు కృష్ణా నుంచి యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్‌కు ఇచ్చినందున, పశ్చిమ కృష్ణా, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బుద్దా వెంకన్నకు అవకాశం కల్పించాలని ఈ ప్రాంత నేతలు కోరుతున్నారు. అలాగే, జిల్లా నుంచి వైవీబీకి ఇచ్చినందున, నగరం నుంచి బుద్దా వెంకన్నకే ఇవ్వాలని పార్టీలో పలువురు సీనియర్  నేతలు సూచిస్తున్నారు.  శుక్రవారం రాత్రి వరకు చంద్రబాబు ఈ సీటు విషయంలో ఎటూ తేల్చలేదు.

జిల్లా, అర్బన్ అధ్యక్షుల మధ్య పోటీ
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న మధ్య ఎమ్మెల్సీ సీటుపై తీవ్ర పోటీ ఉన్నట్లు తెలిసింది.  మంత్రులు  దేవినేని ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు.. బచ్చుల అర్జునుడుకు తప్పనిసరిగా సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆయనకు గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. గతంలో గవర్నరుకోటలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో పాటు బచ్చుల అర్జునుడు పేరును దరిదాపుగా ఖరారు చేశారని, అందువల్ల ఆయనకే సీటు వచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా