మీ ఇళ్లల్లో పెళ్లి జరిగితే సెలవులిచ్చేస్తారా?

23 Nov, 2017 09:39 IST|Sakshi

మంత్రి యనమలను నిలదీసిన ఎమ్మెల్సీ శమంతకమణి

మా ఇళ్లల్లో వివాహానికి ఎవరినీ రానివ్వరు

పదవులు ఇవ్వరు.. గౌరవమూ లేదు

ఇదేం న్యాయమయ్యా మీకు..

సాక్షి, అమరావతి : ‘‘మా దళితుల ఇళ్లల్లో వివాహానికి ఎవరినీ రానివ్వరు. అదే మీ వాళ్ల ఇళ్లల్లో పెళ్లి జరుగుతుంటే మాత్రం ఏకంగా శాసనసభ, శాసనమండలి సమావేశాలనే నిలిపేస్తారా? ఏకంగా సెలవులు ఇచ్చేస్తారా?’’ అని మంత్రి యనమల రామకృష్ణుడిపై శాసన మండలి సభ్యురాలు శమంతకమణి విరుచుకుపడ్డారు. బుధవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసిన తరువాత లాబీల్లో యనమల, శమంతకమణి పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా యనమలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏమయ్యా.. మా దళితులకు ఎలాగూ పదవులు ఇవ్వరు. గౌరవం ఎటూ లేదు. కనీసం మా ఇంట్లో వివాహం జరుగుతుంటే ఎవరినీ రానివ్వకుండా చేశారు.

అదేపనిగా అందరినీ పోలవరం ప్రాజెక్టు వద్దకు అంటూ తీసుకెళ్లారు. మా మనవరాలి (శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యామినిబాల కుమార్తె) పెళ్లి ఈ నెల 16న అనంతపురంలో జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించినా వారిని రానివ్వకుండా పోలవరానికి తీసుకుపోయారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ సోదరుడు శ్రీనివాస్‌ కుమార్తె పెళ్లి 23వ తేదీన అనంతపురంలో జరుగుతుందని ఏకంగా రెండు సభలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చేస్తారా? ఏం.. మా ఇళ్లల్లో శుభకార్యాలకు ఎవరూ రాకూడదా? ఇదేం న్యాయమయ్యా మీకు?’’ అని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పలేక యనమల మౌనంగా ఉండిపోయారు. పయ్యావుల కేశవ్‌ సోదరుడి కుమార్తె వివాహం కర్నూలు రేంజ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ కుమారుడితో గురువారం అనంతపురంలో జరగనుంది.

మరిన్ని వార్తలు