ఎమ్మెల్సీ విజేత ఆర్‌కే

26 Mar, 2015 02:43 IST|Sakshi
ఎమ్మెల్సీ విజేత ఆర్‌కే

భారీ విజయం సొంతం చేసుకున్న రామకృష్ణ
కేఎస్ లక్ష్మణరావుపై 1,763 ఓట్ల మెజారిటీ
ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే స్పష్టమైన ఫలితం
ఫలించిన మంత్రులు, టీడీపీ నేతల మంత్రాంగం

 
గుంటూరు: కృష్ణా-గుంటూరు శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గెలుపొందారు. రామకృష్ణకు విజయం చేకూర్చే బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం చేసిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యూహం ఫలించి చివరకు విజయం వరించింది. ఈనెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం గుంటూరులోని సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాలలో జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగింది. రెండు జిల్లాల పరిధిలో పోలైన 13,047 ఓట్లను డబ్బాలో పోసి అభ్యర్థులవారీగా వేరు చేసి 11 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన 14 టేబుళ్లలో జరిగిన ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో అన్నింటా రామకృష్ణే ఆధిక్యం కనబరిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అవసరం లేకుండానే రామకృష్ణ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు.

మొదటి నుంచి రామకృష్ణదే ఆధిక్యం.. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 18,931 ఓట్లకు గానూ 13,047 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఏఎస్ రామకృష్ణకు 7,146, కేఎస్ లక్ష్మణరావుకు 5,383 ఓట్లు వచ్చాయి. 1,763 ఓట్ల ఆధిక్యంతో రామకృష్ణ విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఏ అభ్యర్థికీ 50 శాతానికి మించి ఓట్లు రానిపక్షంలో ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టి విజయాన్ని నిర్ధారిస్తారు. అయితే, స్పష్టమైన మెజారిటీ రావడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అవసరం లేకుండాపోయింది.
 వెనుదిరిగిన లక్ష్మన్న.. మొదటి నుంచి గెలుపుపై ధీమాతో ఉన్న కేఎస్ లక్ష్మణరావు ఫలితం అధికారికంగా వెలువడక ముందే తన ఓటమిని అంగీకరించారు. ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే కౌంటింగ్ హాలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.

>
మరిన్ని వార్తలు