ఎంఎంబీజీ విద్యార్థుల ప్రపంచ రికార్డు

4 Jun, 2018 08:37 IST|Sakshi
భాస్కరరాజుకు రికార్డు జ్ఞాపికను అందజేస్తున్న జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు

19.11 నిమిషాల్లో వంద వేమన పద్యాలు పఠనం

జీనియస్, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సొంతం

విద్యార్థులు, గురువులకు అవార్డులు అందజేత

తిరుపతి ఎడ్యుకేషన్‌: తిరుపతి ఖాదీకాలనీలోని మేక్‌ మై బేబి జీనియస్‌(ఎంఎంబీజీ) పాఠశాల విద్యార్థులు రెండు ప్రపంచ రికార్డులు సాధించారు. 265 మంది విద్యార్థులు కేవలం 19.11 నిమిషాల్లో వంద వేమన పద్యాలను పఠించి తమ జ్ఞాపకశక్తిని చాటుకున్నారు. మేక్‌ మై బేబి జీనియస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆ పాఠశాల ఆవరణలో అద్భుత మెమొరీ విన్యాసాన్ని చిన్నారులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను రికార్డు చేసేందుకు ఇంటర్నేషనల్‌ జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇండియా చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ బింగి నరేంద్రగౌడ్, ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కో–ఆర్డినేటర్‌ గుర్రం స్వర్ణశ్రీ హాజరయ్యారు.

వీరి సమక్షంలో మూడు నుంచి 14 ఏళ్ల వయస్సు చిన్నారులు ఒకే సారి వంద వేమన పద్యాలను పఠించి రికార్డును చేజిక్కించుకున్నారు. వీరందరికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా భగవద్గీత ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు గంగాధరశాస్త్రి, కావలికి చెందిన అధ్యాపకులు మణి అన్నదాత(ప్రాస మణి),  గుంటూరులోని హిందూ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు, గాంధేయవాది కొత్తపల్లి సీతారాం, విశ్వం విద్యాసంస్థల అధినేత ఎన్‌.విశ్వనాధరెడ్డి హాజరై మాట్లాడారు.

వివిధ అవార్డులు ప్రదానం..
మేక్‌ మై బేబి జీనియస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, గురువులకు వివిధ అవార్డులు ప్రదా నం చేశారు. వంద వేమన పద్యాలను పఠించిన 265 మంది చిన్నారులకు వేమన శతకరత్న, శ్రీమద్భగవద్గీతలోని 2 అధ్యాయాలను పఠించిన 7 ఏళ్లలోపు 20 మంది చిన్నారులకు గీతాబాల, 5 అధ్యాయాలు పఠించిన 28 మంది చిన్నారులకు గీతాఝరి, 18 అధ్యాయాలు పఠించిన అయిదుగురు చిన్నారులకు గీతాసాగర అవార్డులను ప్రదానం చేశారు. అలాగే 100 వేమన పద్యాలను నేర్పిన గురువులు తొమ్మిది మందికి శతకరత్నాకర, శ్రీమద్భగవద్గీత నేర్పిన గురువులు ఐదుగురుకి గీతోపదేశిక అవార్డులను అందజేశారు.

మరిన్ని వార్తలు