ఎంఎంటీ ఎస్ టూ లేట్...

29 Jan, 2014 02:21 IST|Sakshi

     మొత్తం రూ.800 కోట్ల ప్రాజెక్టు
      ఇప్పటివరకు రూ.30 కోట్లే విడుదల
      కొత్త లైన్ల నిర్మాణానికే రూ.380 కోట్లు
 
 సాక్షి, సిటీబ్యూరో :
 ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. ఒక అడుగు ముందుకు... నాలుగడుగులు వెనక్కు అన్నట్టుంది దీని పరిస్థితి. రెండున్నరేళ్లలో పూర్తి చేయవలసిన ప్రాజెక్టు ఇది. ఇప్పటికే ఏడాది గడిచింది. మరో ఏడాదిన్నర మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు పని ప్రారంభం కాలేదు. నిర్దేశిత గడువులోగా పని పూర్తికావడం కాదు కదా. కనీసం ప్రారంభిస్తారా లేదా అనే  సంశయం నెలకొంది. ఎందుకంటే రూ.800 కోట్ల భారీ అంచనాలతో సిద్ధం చేసిన ఈ ప్రాజెక్టులో రెండొంతుల నిధులు కేటాయించవలసిన రాష్ట్రప్రభుత్వం.. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.30 కోట్లే. మిగతా నిధులు కేటాయించాల్సిన రైల్వేశాఖ సైతం రూ.30 కోట్లే చెల్లించింది. రెండోదశలో లైన్లు, విద్యుదీకరణ పనులకే రూ. 380 కోట్లు వెచ్చించాల్సిన తరుణంలో నిధుల్లేక పనులు ప్రారంభం కాలేదు. గడిచిన ఏడాది పొడవునా ప్రణాళికల రూపకల్పన, మార్గాల గుర్తింపు, స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియ ఖరారు వంటి పనులతోనే గడిచింది. మరో ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. అయినా పనులెప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
 
 
 ఎంఎంటీఎస్ రెండో దశపై రాష్ర్టప్రభుత్వం శీతకన్ను వేసింది. కేంద్ర, రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల లేమి అడ్డంకిగా మారింది. నిర్మాణ వ్యయంలో రాష్ట్రప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ  1/3 వంతు చొప్పున నిధులను అందజేయవలసి ఉంటుంది. అంటే రూ.800 కోట్లలో రాష్ట్రం తన వాటాగా రూ.533.33 కోట్లు, రైల్వేశాఖ రూ.266.67 కోట్లు కేటాయించాలి. కానీ ఇప్పటివరకు రెండు వైపులా అందింది రూ.60 కోట్లే. దక్షిణమధ్య రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మొత్తం 6 లైన్లలో రెండోదశకు రంగం సిద్ధం చేసింది. బ్రిటన్‌కు చెందిన బాల్‌ఫోర్‌బెట్టి, ఇండియాకు చెందిన కాళింది సంస్థలు సంయుక్తంగా ఈ టెండర్లను దక్కించుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే హడావిడి మొదలైంది. అనేక దశలను దాటుకొని చివరకు టెండర్ల  ప్రక్రియను పూర్తి చేసుకుంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ ఒక రాయి వేసి శంకుస్థాపన చేసిన దాఖలా కనబడటం లేదు.
 
 మొదటి నుంచి నిర్లక్ష్యమే...
 రెండోదశపై మొదటి నుంచి రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తోంది. ఎంఎంటీఎస్ మొదటి దశలో ఫలక్‌నుమా-సికింద్రాబాద్-లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో రైలు మార్గాలు, రైల్వేస్టేషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశను మరింత విస్తరించి రెండో దశలో నగరం నలువైపులా ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం 2005లోనే ప్రతిపాదించింది. అయినా అది ప్రతిపాదనలు, కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు  విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. చివరకు గత ఆర్థికసంవత్సరం రైల్వే బడ్జెట్‌లో ఇది స్థానం సంపాదించుకుంది. ప్రణాళికలు పూర్తయ్యాయి. రైల్వే మార్గాల సర్వే, టెండర్ల  కేటాయింపులు ముగిశాయి. ప్రస్తుతం పని ప్రారంభం కావలసిన దశలో.. ప్రభుత్వం అందజేయవలసిన నిధుల విషయంలో మొండి చెయ్యి చూపుతోంది.
 
 రానున్న కొత్త ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లు
 ఫిరోజ్‌గూడ
 సుచిత్ర జంక్షన్
 బీహెచ్‌ఈఎల్
 భూదేవీనగర్
 మౌలాలీహౌసింగ్‌బోర్డు కాలనీ
 
 రెండోదశ పనులివీ...
 
 ఎక్కడి నుంచి ఎక్కడకు    కి.మీ.    ఏం చేయాలి
 ఘట్కేసర్- మౌలాలీ    14    కొత్త లైన్లు, విద్యుదీకరణ
 సనత్‌నగర్-మౌలాలీ    23    సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ
 బొల్లారం-మేడ్చెల్    14    సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ
 సికింద్రాబాద్-బొల్లారం    14    సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ
 ఫలక్‌నుమా-ఉందానగర్    --    సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ
 సికింద్రాబాద్-బొల్లారం    14    విద్యుదీకరణ
 తెల్లాపూర్-రామచంద్రాపురం    10    పాత లైన్ల పునరుద్ధరణ

మరిన్ని వార్తలు