రాజంపేట జీవనచిత్రం మారనుందా

21 Nov, 2019 10:56 IST|Sakshi
అన్నమయ్య ప్రాజెక్టు( ఫైల్‌ ఫోటో)

అన్నమయ్య ప్రాజెక్టుకు నిరంతర జలకళ

ప్రాజెక్టుకు కొత్త ప్రతిపాదనల రూపకల్పన

జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి లిప్టు ఇరిగేషన్‌తో నీరు తరలింపు

సీఎంకు నివేదించిన ఎమ్మెల్యే మేడా

అన్నమయ్య ప్రాజెక్టు నిరంతర జలకళ సంతరించుకోనుందా.. రాజంపేట జీవనచిత్రం మారనుందా .. కొత్త ప్రతిపాదనలతో ఇది సాధ్యమేనంటున్నారు ఇంజినీరింగ్‌ అధికారులు..విద్యార్థులు.. తమ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే 70,000 ఎకరాలకు సాగునీరందుతుందని కుండబద్ధలుకొట్టి చెబుతున్నారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా ఇది సాధ్యమేనంటున్నారు. తమ ఆలోచనలకు పదును పెట్టి ప్రాజెక్టు దిగువ భాగాన పాక్షిక సబ్‌సర్ఫేస్‌ డ్యామ్‌  నిర్మించాలనే ప్రతిపాదనలను ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి నివేదించారు. డీపీఆర్‌ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

సాక్షి, కడప : అన్నమయ్య ప్రాజెక్టులో నిత్యం నీరుండే పరిస్థితి కనిపించడంలేదు. ఒక ఏడాది నీరు కనిపిస్తే మరో రెండేళ్లు జలకళకు దూరమవుతోంది. దీని మీద ఆశలు పెట్టుకున్న రైతాంగానికి అండగా నిలబడలేకపోతోంది. ఏటా ఒకేతరహా నీరు నిల్వ ఉండేలా ఈ ప్రాజెక్టు ఉండాలంటే ఏం చేయాలి.. దీని పరిధిలో మరిన్ని ఎకరాలకు సాగు నీరందించాలంటే ఎలా..ఈ ప్రశ్నలకు సమాధానం తమ వద్ద ఉందని చెబుతున్నారు గతంలో ఇక్కడ నీటిపారుదల ఈఈగా పనిచేసిన రమేష్‌.. ఈ ప్రాజెక్టుపై ఆయ న తన పరిధిలోని ఇంజినీర్లతో కలిసి మెదడుకు పదును పెట్టారు. కేఎస్‌ఆర్‌ఎం, అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన కొందరు విద్యార్థులు ప్రాజెక్టు వర్కులో భాగంగా తమ వైవిధ్యమైన ఆలోచనలను ఇంజినీర్లతో పంచుకున్నారు. ఫలితంగా కొత్త ప్రతిపాదనలను ఆవిష్కరించగలిగారు. 

ప్రాజెక్టు ప్రస్తుతం ఇలా : అన్నమయ్య ప్రాజెక్టు నీటి కెపాసిటీ 2.24 టీఎంసీలు.1996 వరకు ఈ ప్రాజెక్టు చెయ్యేరు ప్రాజెక్టుగా(సీపీసీ) డివిజన్‌ కింద ఉండేది. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టుగా మారింది.అన్నమయ్య ప్రాజెక్టుకు ఫించా,బాహుదానది,మాండవి నుంచి నీరు చేరేది. 2001లో ప్రాజెక్టు పూర్తయిన కొన్ని నెలలకే 5 గేట్లలో మొదటి గేటు కొట్టుకుపోయింది. నిపుణుల కమిటీ పరిశీలించి వెల్డింగ్‌ సరిగాలేదని పేర్కొంది.  మళ్లీ 5 గేట్లను నిర్మించారు. 2012 వరకూ ఈ నిర్మాణ ప్రక్రియ కొనసాగింది.  2015 నవంబర్‌లో తొలిసారిగా ప్రాజెక్టుకు 2.01 టీఎంసీల నీరు చేరింది. 2016లో చుక్క నీరు కూడా రాలేదు. 2017లో 2.24 టీఎంసీల మేర నీరు చేరింది. గత ఏడాది నీరు లేక ప్రాజెక్టు జలకళ తప్పింది.

ప్రస్తుతం ప్రాజెక్టులో 1.55 టీఎంసీల నీరుంది..
కొత్త ప్రతిపాదనలు ఇలా: అన్నమయ్య ప్రాజెక్టులో నిరంతరం నీరుండేలా అధికారులు కొత్త ప్రతిపాదనలు తయారుచేశారు. ఈ ప్రతిపాదనల రూపకల్పనలో కేఎస్‌ఆర్‌ఎం, అన్నమాచార్య ఇంజనీరింగ్‌ విద్యార్థుల మేథస్సును కూడా వినియోగించుకున్నారు.  ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా విద్యార్థులు గత ఈఈ రమేష్‌ బృందంలో చేరి ఆలోచనలు పంచుకున్నారు. ప్రాజెక్టుకు జీఎన్‌ఎస్‌ఎస్‌ రెండోదశ ప్రధాన కాలువ కిలోమీటరు దూరంలో ఉంది. అక్కడి నుంచి ఎత్తిపోతల కింద ప్రాజెక్టుకు నీటిని తరలించే కోణంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 20 మీటర్ల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని తరలించవచ్చని అంచనాకు వచ్చారు. రోజుకు 800 క్యూసెక్కుల మేర 36 రోజులలో 2.4 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేసి ప్రాజెక్టు సామర్ధ్యం మేర తరలించవచ్చని భావించారు.

ఇప్పుడున్న 10,236 ఎకరాల ఆయకట్టుతోపాటు దిగువనున్న 12,500 ఎకరాలకు కూడా కొత్త ప్రతిపాదనల ద్వారా నీటి అందించవచ్చంటున్నారు. . ఇందుకు రూ.101 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదించారు.  2.4 టీఎంసీలు నింపగలిగితే దిగువనున్న సుమారు వంద గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది. దిగువకు నీటిని వదిలినపుడు ఆ ప్రాంతంలోని 36 ఊట కుంటలు ఎప్పుడూ నీటితో ఉండేలా 36 పాక్షిక సబ్‌ సర్ఫేజ్‌ డ్యాములను నిర్మించాలనేది కూడా కొత్త ప్రతిపాదనలో భాగం.  సర్ఫేజ్‌ డ్యాముకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వ్యయమవుంది. అంటే సుమారు రూ.94 కోట్లు అవసరమవుతాయి. 100 నుంచి 200 మీటర్ల లోతులో మూడు మీటర్ల వెడల్పుతో   సర్ఫేజ్‌ డ్యాములను నిర్మించాల్సి ఉంటుంది.

సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రశంస
యోగి వేమన యూనివర్శిటీలో గతంలో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌లో ఈ ప్రతిపాదనను ప్రవేశ పెట్టారు. అక్కడ ప్రశంసలు అందుకున్నాయి. ఇంజనీరింగ్‌ విద్యార్థుల మేధస్సును ఉపయోగించుకుని ఇలాంటి ప్రయత్నాలు చేయడంపై వ్రశంసల జల్లు కురిసింది. గతంలో ఈఈగా పనిచేసిన  రమేష్‌ సాక్షితో మాట్లాడుతూ తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పరిశీలించి అభినందించారన్నారు. వీలైనంత త్వరలో డీపీఆర్‌ ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. తాజా ప్రతిపాదన వల్ల రాజంపేట జీవన పరిస్థితులు  మారిపోయే అవకాశాలున్నాయి. 2015 నవంబరులో ప్రాజెక్టు నుండి ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడంతో పండ్ల తోటల ద్వారా రూ. 400 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.  నిరంతరం నీరు ఉంటే కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. 70వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. 

ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం
కాలువల ఆధునీకరణకు రూ.32 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం. పాక్షిక సబ్‌ సర్ఫేజ్‌ డ్యాముల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపాం. జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా ప్రాజెక్టులను నింపే ప్రతిపాదన ప్రభుత్వానికి అందజేశాం.     – రవి కిరణ్, ఈఈ, అన్నమయ్య ప్రాజెక్టు
  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా