తిరుపతిలో మోడల్‌ బస్టాండ్‌

7 Mar, 2020 13:22 IST|Sakshi
ఆర్టీసీ 13 ఎకరాల స్థలంలో ఉన్న భవనాలతో కూడిన మ్యాప్‌

రూ.400కోట్లతో అభివృద్ధి

13 అధునాతన  భవనాల నిర్మాణం

నివేదిక సిద్ధం చేసిన అధికారులు

త్వరలోనే ప్రభుత్వం ముందుకు ప్రతిపాదన

రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకణలో భాగంగా అన్ని ప్రాంతాలకుఅవకాశాలు కల్పించేందుకు చర్యలుతీసు కుంటోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికిఓ సువర్ణ అవకాశం దక్కనుంది.అత్యాధునిక వసతులతో కూడిన మోడల్‌ బస్టాండ్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగించే ప్రయాణ ప్రాంగణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలనుకల్పించేందుకు 13 అధునాతన భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

తిరుపతి అర్బన్‌:  తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటుంది. 1972లో తిరుపతి బస్టాండ్‌ కోసం  అప్పటి ప్రభుత్వం సుమారు 13 ఎకరాలను కేటాయించింది. అందులో చిన్నపాటి బస్టాండ్‌ను నిర్మించారు. తర్వాత  కాలంలో ప్రయాణికల రద్దీ పెరగడంతో శ్రీహరి బస్టాండ్, శ్రీనివాస బస్టాండ్, ఏడుకొండల బస్టాండ్, పల్లెవెలుగు బస్టాండ్‌లుగా విస్తరించారు. వీటిలో 10 భవనాలు, సుమారు 200పైగా దుకాణాలను నిర్మించారు. అయినా ప్రయాణికుల తాకిడి పెరిగిన సమయాల్లో వసతుల కల్పనకు ఇక్కట్లు తప్పడంలేదు. 

రూ.400కోట్లతో 13 అధునాతన భవనాలు
విజయవాడ పురవాస్తుశాఖ అధికారుల బృందం తిరుపతిలో మోడల్‌ బస్టాండ్‌ నిర్మాణం కోసం రెండు రోజుల కసరత్తు తర్వాత నివేదిక తయారుచేసింది. సుమారు రూ.400కోట్లతో 13 అధునాతన భవంతులను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రయాణికులకు అవసరమైన వసతులు, అంచనావ్యయం పొందుపరిచిన రిపోర్టును రేపోమాపో ప్రభుత్వానికి అందించనుంది. పరిపాలనా అనుమతులు రాగానే జూన్‌ నుంచే నిర్మాణ పనులను మొదలు పెట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 13 అంతస్తులను నిర్మించేందుకు సుమారు 3 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా తిరుపతి నగరానికి నాలుగు వైపులా తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రేణిగుంట మార్గం, అలిపిరి, మంగళం, తిరుచానూరును ఎంపిక చేశారు. ప్రస్తుతం తిరుపతిలోని అన్ని బస్టాండ్ల నుంచి నిత్యం సుమారు 1000 బస్సుల్లో 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. జిల్లా మొత్తంమీద ఆర్టీసీకి రూ.2 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 40 శాతం తిరుపతి నుంచే సమకూరుతోంది. ప్రస్తుత బస్టాండ్‌లో ప్రయాణికులకు పూర్తిస్థాయిలో వసతులు లేవు. తిరుపతి బస్టాండ్‌ను మోడల్‌గా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పడుతుందని పలువురు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మీ వద్దకే ఆర్టీసీ బస్సు..
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాలు, పల్లెలకే కాకుండా బస్సులను అన్ని ప్రాంతాలకు నడపాలని భావిస్తున్నారు. ‘మీ వద్దకే.. ఆర్టీసీ బస్సు’  కార్యక్రమానికి రాష్టంలో తొలిసారిగా తిరుపతి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలకు బస్సు సర్వీసులను అందించనున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కూడా బస్సులు నడవనున్నాయి. తీర్థయాత్రల కోసం ఎవరైనా సంప్రదిస్తే రాయితీ చార్జీలతో బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు.

సూచనప్రాయంగా ఆదేశాలందాయి
రాష్ట్రంలో తొలి మోడల్‌ బస్టాండ్‌ను తిరుపతిలో నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ మేరకు సూచనప్రాయంగా ఆదేశాలందాయి. రూ.400కోట్లతో 13 అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు. అందులో ప్రయాణికులకు అత్యాధునిక వసతులు ఉంటాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని అన్ని కర్మాగారాలకు బస్సు సర్వీసులను నడపనున్నాం. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు కూడా బస్సులు వెళతాయి. వ్యక్తిగత కార్య క్రమాలకు కూడా రాయితీ చార్జీతో బస్సు సేవలను అందిస్తాం. ఆర్టీసీ బస్సు వెళ్లని ప్రాంతం ఇక ఉండదు. చివరకు గ్రామీణప్రాంతాల్లోని చిన్నచిన్న ఆలయాలకు కూడా బస్సులను నడుపుతాం. – తిమ్మాడి చెంగల్‌రెడ్డి, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్, తిరుపతి

మరిన్ని వార్తలు