మోడల్

28 May, 2014 01:14 IST|Sakshi

 అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మోడల్ స్కూళ్లు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఆశయం బాగున్నా ఆచరణలో మాత్రం వీటి పరిస్థితి ‘మూడడుగులు ముందుకు.. ఆరడులు వెనక్కు’ అన్న చందంగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారింది.
 
 పేద పిల్లలు ప్రతిభ ఉండి కూడా సరైన ప్రోత్సాహం లేక చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉత్తమ విద్య, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా అలాంటి జాడ కన్పించడం లేదు. ఈ
 నేపథ్యంలో ‘మోడల్’ చదువు ప్రశ్నార్థకంగా మారింది.
 
 అడుగడుగునా నిర్లక్ష్యం
 ఇతర విద్యా సంస్థలకు మోడల్‌గా నిలవాల్సిన ఈ స్కూళ్లు ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ‘డల్’ స్కూళ్లుగా మారాయి. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తుత్తివేనని ఈ స్కూళ్ల విషయంలో మరోసారి తేట తెల్లమవుతోంది. ప్రతి మండలంలోనూ ఓ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 63 మండలాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2012-13 విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2013-14 సంవత్సరానికి వాయిదా వేశారు. ఆ ఏడాది కూడా తొలివిడతగా కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు.
 
 పోనీ ఈ 25 స్కూళ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయ్యాయా అంటే అదీ లేదు. ఆగమేఘాల మీద ప్రారంభించి అద్దె భవనాల్లో స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ స్కూళ్ల భవనాలు పూర్తి స్థాయి నిర్మాణాలకు నోచుకోలేదంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 38 మండలాల్లో ఈ ఏడాది (2014-15) మోడల్ స్కూళ్లు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే నిధుల కొరతతో కొన్ని మండలాల్లో భవన నిర్మాణాలు పెండింగ్‌పడగా, మరికొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు.  
 
 బాలారిష్టాల్లో తొలి విడత స్కూళ్లు
 తొలివిడతగా గతేడాది జిల్లాలో అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, హిందూపురం, కళ్యాణదుర్గం, కనగానపల్లి, కణేకల్, నల్లచెరువు, పామిడి, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడి కి, యల్లనూరు మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. స్కూళ్లు ప్రారంభమై ఏడాది అయినా బాలరిష్టాలు ఎదుర్కొంటున్నాయి. కనీస వసతులు కరువయ్యాయి. కనీసం తాగునీటి సదుపాయం చాలా స్కూళ్లలో లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఫర్నీచరు కరువైంది.
 
 వసతి సదుపాయం కరువు
 మోడల్ స్కూళ్లలో 6,7,8 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తు చేసుకున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి రెసిడెన్షియల్ విషయంలో చేతులెత్తేశారు. దీంతో మండల పరిధిలోనే దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ స్కూళ్లలో చదువుకోలేక, అలాగని వదిలి పెట్టలేక తలలు పట్టుకుంటున్నారు.
 
 చాలాచోట్ల తల్లిదండ్రులు అద్దె ఆటోలను మాట్లాడి రోజూ పిల్లలను బడికి పంపుతున్నారు. ఉదాహరణకు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి, కనుముక్కల, ఓబుళంపల్లి, వెంకటాంపల్లి, పులేటిపల్లి తదితర గ్రామాల నుంచి వంద మంది దాకా విద్యార్థులు రోజూ ఆటోల్లో స్కూల్‌కు వస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  ఇదిలాఉండగా గతేడాది ప్రతి స్కూల్‌లోనూ 20 శాతం అదనంగా విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం అన్ని స్కూళ్లలోనూ కలిపి 100 సీట్లకు పైగా ఖాళీలు ఉండడం విశేషం.
 
 ఈ‘సారీ’ ప్రవేశాలు లేవు
 వాస్తవానికి ఈ ఏడాది (2014-15 విద్యా సంవత్సరం) 38 మండలాల్లో మోడల్ స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఏ ఒక్క మండలంలోనూ ప్రారంభం కాని పరిస్థితి. 6,7,8 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశం కల్పించాల్సి ఉంది. స్కూళ్లు ప్రారంభానికి నోచుకోని కారణంగా గతేడాది ప్రారంభమైన 25 స్కూళ్లలో కేవలం ఆరో తరగతికి మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు.
 
 సీట్లు 2 వేలు..
 దరఖాస్తులు 5,680
 జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు 2 వేల సీట్లుంటే.. 5,680 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. దీన్ని బట్టి మోడల్ స్కూళ్లలో చదువుకునేందుకు విద్యార్థులు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి సంబంధించి మంగళవారం డీఈఓ మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు.
 
 అగళి, అమడగూరు, అమరాపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, గార్లదిన్నె, గుత్తి, హిందూపురం , కళ్యాణదుర్గం మండలాలకు కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లాటరీ నిర్వహించారు. కనగానపల్లి, కనేకల్లు, నల్లచెరువు, పామిడి, పుట్లూరు, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు మండలాలకు ఆదిమూర్తినగర్‌లోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్.. రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు మండలాల విద్యార్థులకు కేఎస్‌ఆర్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో లాటరీ నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ తీశారు. మొత్తం 2 వేల సీట్లకు గాను 5,680 దరఖాస్తులు వచ్చాయి. ప్రతి స్కూల్‌లోనూ 80 సీట్లు భర్తీ చేశారు. 20 శాతం అదనంగా అంటే ఎనిమిది మందిని ఎంపిక చేశారు. ఈలెక్కన ఒక్కో స్కూలుకు 88 మందిని ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా యల్లరూరు మండలంలో సీట్లకంటే కూడా దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వచ్చాయి.
 
 దీంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ అవకాశం కల్పించారు. ఇంకా పది సీట్లు ఖాళీగా మిగిలాయని డీఈఓ వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఎస్‌ఏ ఏడీ శ్రీరాములు, డైట్ కళాశాల లెక్చరర్లు సుబ్బారావు, సాయిప్రసాద్, హెచ్‌ఎంలు లోకేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్‌తో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు