కూతకు వెళ్తే పతకం కానీ అడ్డుగా పేదరికం

19 Jul, 2019 10:52 IST|Sakshi
కబడ్డీ క్రీడాకారుడు నరేష్‌

సాక్షి, పత్తికొండ(కర్నూలు) : ప్రతిభ ఉన్న ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువై ఇంటికే పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో నరేష్‌ ఒకరు. అతని ప్రతిభకు పేదరికం అడ్డుగా మారింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ క్రీడాకారుడు కబడ్డీలో రాణిస్తూ అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఏ జట్టులో ఉన్న ప్రత్యేకత చాటుతూ పతకాలు సాధిస్తున్నాడు. ప్రోత్సహిస్తే సత్తా చూపుతానంటున్నాడు. మిగతా వివరాలు అతని మాటల్లో ‘మాది పత్తికొండ మండల పరిధిలోని దేవనబండ గ్రామం. వంకాయల నాగప్ప, సువర్ణమ్మలకు నేను రెండో సంతానం.

మోడల్‌ స్కూల్‌కు ఎంపిక కావడంతో 9వ తరగతిలో చేరా. ప్రస్తుతం అక్కడే సీఈసీ సెకండియర్‌ చదువుతున్నా. పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ క్రీడలపై ఆసక్తితో కబడ్డీ బాగా అడేవాడిని. ఉపాధ్యాయుల సహకారంతో స్కూల్‌ స్థాయి టోర్నమెంట్‌లో పత్తికొండ, పుచ్చకాయలమాడ, బినిగేరి, ఎం.అగ్రహారం, పత్తికొండ, మొలగవల్లి, జొహరాపురంలో టీం తరఫున ఆడాను. ఆదోని జోనల్‌ పోటీల్లో రాణించడంతో గుర్తించిన జిల్లా అసోషియేషన్‌ సహకారంతో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ పోటీలకు అవకాశం లభించింది.

ఇండియన్‌ రూరల్‌ ఒలంపిక్‌ అసోషియేషన్‌ తరఫున మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌లోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ట్రిపుల్‌ ఐటీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జూన్‌ 7వ తేదీ నుంచి 9వతేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ చాటాను. ఈ పోటీల్లో ఫైనల్స్‌ మ్యాచ్‌లో హర్యానా జట్టుపై ఆంధ్రజట్టు రన్నర్స్‌గా నిలిచింది. జట్టులో నేను ప్రతిభ కనపరచడంతో జూన్‌ 27న రాజస్థాన్‌లో యూత్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు అవకాశం కల్పించారు. అక్కడ కూడా ప్రతిభ చాటాను.   

మరిన్ని వార్తలు