మోడల్ స్కూల్స్

8 Nov, 2014 02:40 IST|Sakshi
మోడల్ స్కూల్స్

అధ్వానంగా ఆదర్శ పాఠశాలలు
80 శాతం సిబ్బంది కొరత
కంప్యూటర్లూ కరువే
పునాదులకే పరిమితమైన హాస్టళ్లు
తాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే
మరుగుదొడ్లు లేక ఇబ్బందులు

 
చిత్తూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలు అధ్వానంగా మారాయి. పాఠశాలలు ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా పలు పాఠశాలలకు సొంత భవనాలు లేవు. హాస్టల్ భవనాలు పునాదులకే పరిమితమయ్యాయి. మంచినీరు కూడా అందని పరిస్థితి, పాఠశాలలకు వెళ్లేందుకు సరైన దారి లేదు. ఆటస్థలాలు అసలే లేవు. మరుగుదొడ్ల వసతి కల్పించిన పాపానపోలేదు. ఇప్పటికీ 80 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలలకు 40 కంప్యూటర్లను కేటాయించి విద్యార్థులకు సాంకేతిక విద్యనందిస్తామని అధికారులు గొప్పలు చెప్పినా నామమాత్రంగా కూడా కంప్యూటర్లు అందించలేదు. ఏ ఒక్క ఆదర్శ పాఠశాలలోనూ కంప్యూటర్ శిక్షకుడు లేరంటే మోడల్ స్కూళ్ల పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది.
 జిల్లాలో 2009- 10 సంవత్సరానికిగాను ప్రభుత్వం ఫేస్-1 కింద 18, ఫేస్ -2 కింద మరో  రెండు.. మొత్తం కలిపి 20 ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. జిల్లాలోని రామకుప్పం, గంగవరం, నిమ్మనపల్లె, రొంపిచెర్ల పాఠశాలలకు ఇంతవరకు సొంత భవనాలను నిర్మించలేదు. దీంతో అధ్వానపు వసతుల మధ్య ఆ పాఠశాలలు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి.

కొద్దిపాటి చినుకులు రాలినా గదులు ఉరుస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అన్ని ఆదర్శ పాఠశాలల్లోనూ హాస్టల్ భవనాలు పూర్తి కాకపోవడంతో ఆరుబయటే వంట చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల ఆవరణలు ముళ్లచెట్లతో నిండిపోయాయి. సరైన రహదారి సౌకర్యం లేదు. హాస్టల్ లేకపోవడంతో బాలికలు సక్రమంగా పాఠశాలలకు రావడంలేదు. పలు పాఠశాలలు గ్రామాలకు దూరంగా నిర్మించడంతో విద్యార్థులు రాలేక పాఠశాలలకు ఎగనామం పెడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వం నిర్మించిన ఆదర్శ పాఠశాలల్లో విద్యతోపాటు మౌలికవసతులు కరువయ్యాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. దాదాపు 1300 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కుప్పం, శాంతిపురం, రామకుప్పం పాఠశాలల్లో హాస్టల్ భవనాలు పునాదులకే పరిమితమయ్యాయి. వంటగదులు లేవు. పై మూడు పాఠశాలల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. సగానికి పైగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 44 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7 కంప్యూటర్లు మాత్రమే ఇచ్చారు. ఐదు మండలాలకు సంబంధించి హాస్టల్ భవనాలు పూర్తి కాలేదు.

     పలమనేరు నియోజకవర్గంలో బెరైడ్డిపల్లె మండలంలో మాత్రమే మోడల్ స్కూల్ ఉంది. అధ్యాపకుల కొరత వల్ల పాఠశాలలో చురుకైన విద్యార్థులే మిగిలిన విద్యార్థులకు పాఠాలు చెబుతుండడం విశేషం.     పుంగనూరు నియోజకవర్గంలో అడవినాచనగుంటలో వంటగది లేదు. ప్రహారీగోడ లేదు. ఇంటర్‌లో 140 మంది విద్యార్థులుండగా ముగ్గురు లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. హాస్టల్ భవనం లేదు. పీలేరు నియోజకవర్గంలో కలకడ, కేవీపల్లెలో రెండు మోడల్ స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. రెండు పాఠశాలల్లో పది మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. కలకడ స్కూల్‌కు సరైన దారి లేదు.  సత్యవేడు నియోజకవర్గంలో కన్నవరం, కేవీబీ పురం పాఠశాలల్లో వంట గదులు లేవు. కంప్యూటర్ ఆపరేటర్, పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టల్ వసతి లేరు.
 
చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రావారిపాళెం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. పిల్లల తల్లిదండ్రులే చందాలేసుకుని కొంత మంది ఉపాధ్యాయులను నియమించుకున్నారు.  జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, కా ర్వేటినగరం పాఠశాలల్లో సి బ్బంది కొరత ఉంది. మరుగుదొడ్ల సౌకర్యం లేదు. కంప్యూట ర్లు నామమాత్రంగా ఇచ్చారు.
 

>
మరిన్ని వార్తలు