ఆదర్శం.. అస్తవ్యస్తం

6 Nov, 2013 01:12 IST|Sakshi

కర్నూలు(విద్య), న్యూస్‌లైన్:  కేంద్రీయ విద్యాలయాల తరహాలో బోధన ఉంటుందన్నారు. గ్రామీణ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతామని ప్రగల్బాలు పలికారు. రాష్ట్రస్థాయిలోనే గాక జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సైతం మన విద్యార్థులు అవలీలగా ర్యాంకులు సాధిస్తారని గొప్పలు చెప్పుకున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.3కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. మూడేళ్ల పాటు పడీలేస్తూ పాఠశాల నిర్మాణాన్ని అరకొరగా పూర్తి చేశారు. హడావుడిగా ప్రిన్సిపల్, పిజిటి, టిజిటి, బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ ప్రకటించారు. నియామకాల్లో మాత్రం నత్తతో పోటీపడ్డారు. తీరా టిజిటిలతో ప్రస్తుతం పనిలేదని వారి నియామకాలను పక్కన పెట్టారు. దీంతో జిల్లాలో 216 మంది టిజిటిలు ఎంపికై నియామకం పొందలేక త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడుతున్నారు.

మరోవైపు బోధనేతర సిబ్బంది పోస్టులను ఎమ్మెల్యేల పేరు చెప్పి అవుట్‌సోర్సింగ్ సంస్థలు అమ్ముకున్నాయన్న విమర్శలూ వ్యక్తం అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం హాస్టళ్లు లేకుండానే, అరకొర వసతులతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలపై మంగళవారం న్యూస్‌లైన్ విజిట్ చేసింది. ఈ విజిట్‌లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ చదువులు చెప్పిస్తామంటూ  జిల్లాలో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.  ఈ మేరకు కర్నూలు జిల్లాలో ప్రతి మండలానికో పాఠశాలను మంజూరు చేసింది. ఐదెకరాల విస్తీర్ణంలో ప్రతి మండల కేంద్రంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే అప్పటి జిల్లా విద్యాశాఖాధికారులు కేవలం 36 మండలాల్లో మాత్రమే పాఠశాలకు స్థలాన్ని చూపగలిగారు.  దీంతో ఒక్కో పాఠశాలకు రూ.3.02కోట్లను మంజూరు చేశారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో కేవలం 31 పాఠశాలలు మాత్రమే అందుబాటులోకి రావడంతో వాటిలోనే తరగతులు ప్రారంభించారు. పగిడ్యాల, బేతంచర్ల, కోసిగి, నంద్యాల, ఆళ్లగడ్డలో నిర్మాణం పూర్తి కాలేదు.

ప్రతి పాఠశాలలో ఆరు నుంచి 12వ తరగతి వరకు తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. మొదటి సంవత్సరం ఆరు నుంచి 9వ తరగతితో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరాన్ని ప్రారంభించారు. ఇంటర్ మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులను పరిచయం చేశారు. మొదట్లో రెసిడెన్సియల్ పాఠశాలగా చెప్పిన అధికారులు భవన నిర్మాణం పూర్తి కాలేదని చెప్పి డే స్కాలర్‌గా ప్రారంభించారు. దీంతో విద్యార్థులు ఈ పాఠశాలల్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలలోనూ పూర్తిగా వసతులు, సౌకర్యాలు కల్పించలేకపోయారు. అరకొర ఉపాధ్యాయులతో విద్యార్థులకు బోధిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కూడా విద్యార్థులకు అందించలేకపోతున్నారు.

మరిన్ని వార్తలు