నవ్యాంధ్రలో ఆధునిక భవనాలు

15 Aug, 2015 05:09 IST|Sakshi
నవ్యాంధ్రలో ఆధునిక భవనాలు

నవ్యాంధ్రకు నూతన హంగులు.. ఆధునిక సాంకేతిక విధానాలు.. ఉరకలేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. మెట్రో సిటీలకు దీటుగా నూతన భవనాలు వంటి ఎన్నెన్నో శుభ పరిణామాలు రాజధాని ప్రాంతం గుంటూరులో చోటు చేసుకుంటున్నాయి.. రాజధాని నేపథ్యంలో నగర  ముఖచిత్రం పూర్తిగా మారనుంది.. బహుళ అంతస్తులు శరవేగంతో రూపుదిద్దుకుంటున్నాయి.. ఆధునిక హుందాతో నగరం నలుదిశలు వ్యాపిస్తున్నాయి.. కార్పొరేట్ సంస్థలు తమదైన పంథాలో నగరంలో వివిధ సంస్థలు నెలకొల్పి నగరవాసులను ఆకట్టుకోనున్నాయి.. వీకెండ్ సరదాలకు, నిరంతరం బిజీగా జీవించే  వారు ఉత్సాహంగా గడపటానికి ప్రత్యామ్నాయ వనరులు ఏర్పడనున్నాయి.
 
- కార్పొరేట్ సంస్థల ఆసక్తి
- చురుగ్గా నిర్మాణ పనులు
- నగరవాసులకు వినోద సౌకర్యాలు
గుంటూరు కల్చరల్

నవ్యాంధ్ర రాజధాని నూతన సాంకేతిక పరిజ్ఞానం దిశగా అడుగులేస్తోంది. మెట్రోసిటీల వసతులకు తీసిపోని విధంగా రూపొందుతోంది.  గుంటూరు నగరంలో బహుళ అంతస్తుల సముదాయాలు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. వినోదాలకు మల్టీఫ్లెక్స్ థియేటర్లు, టైంపాస్‌కు షాపింగ్ కాంప్లెక్స్‌లు, విశ్రాంతికి హోటళ్లు, ఉల్లాసానికి స్విమింగ్ పూల్స్, శరీర వ్యాయామానికి ఇండోర్ జిమ్,ప్లే గ్రౌండ్‌లు వంటి వి ఒకే భవనంలో నగర వాసులను ఆకట్టుకోనున్నాయి. కార్పొరేట్ దిగ్గజాలు ఒక్కొక్కటిగా నగరంలోకి అడుగిడుతున్నాయి.

లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఇప్పటికే నూతన హంగులతో థియేటర్లు, భారీ సముదాయాల్లో వస్త్ర, నగల దుకాణాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు కొలువుదీరాయి. కళానికేతన్ వారి భారీ బహుళ అంతస్తు ఈ రోడ్డులో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. విశాలమైన ఆరు అంతస్తుల్లో వస్త్ర, వజ్రాభరణాలు, కిడ్స్ వినోద శాలలు ఇక్కడ నెలకొల్పనున్నారు. రింగ్‌రోడ్డుల్లో ఓ ప్రైవేట్ యాజమాన్యం వారు చేపట్టినా ఒకే బహుళంతస్తు భవనంలో హైదరాబాద్ మహానగరంలో ఐమాక్స్ థియేటర్‌లకు దీటుగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, భవనం టాప్‌లో స్విమ్మింగ్ పూల్స్, సాంకేతిక పరిజ్ఞానంతో ఐమాక్స్ థియేటర్లు వంటివి ఈ భవనంలో  కొలువు దీరనున్నాయి.
 
విడిది కేంద్రాలు ఇవిగో..

నగరవాసులకు వీకెండ్ విశ్రాంతికి నగరం శివారు ప్రాంతాలు సిద్ధమౌతున్నాయి. అమరావతి రోడ్డు, మంగళగిరి రోడ్డు, గుజ్జనగుండ్ల, చిలకలూరిపేట బైపాస్ వంటి నగర శివారు ప్రాంతాలలో వినోదాలకు, విలాసాలకు కొన్ని ప్రైవేట్ సంస్థలు విడిది కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి రోడ్డులో ఇప్పటికే మెట్రో నగరాలకు దీటుగా ఓ ప్రైవేట్ యాజమాన్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో థియేటర్‌ను పునరుద్ధరించి ఆకట్టుకుంటోంది. సిటీకి ప్రప్రథమంగా డాల్‌బీ అట్మాస్ సౌండ్ వ్యవస్థను థియేటర్‌ల్లో ఏర్పాటు చేసి ప్రేక్షకులను అలరిస్తోంది. గుంటూరు 1 టౌన్‌లో నాలుగు థియేటర్లలో, టూ టౌన్ నాలుగు ధియేటర్లలో 2 కె విజువల్స్‌తో సాంకేతికతో కూడిన డీటీఎస్ సౌండ్‌ను పునరుద్ధరించారు.

మరిన్ని వార్తలు