ఆధునికీకరించిన ఎస్‌బీఐ కలెక్టరేట్ శాఖ ప్రారంభం

22 Feb, 2014 02:59 IST|Sakshi

 ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక ప్రకాశం భవనంలో ఆధునికీకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కలెక్టరేట్ శాఖను కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం ప్రారంభించారు. 2009లో ఎస్‌బీఐ ఎక్స్‌టెన్షన్ కౌంటర్‌గా ప్రారంభమై ప్రస్తుతం పూర్తిస్థాయి బ్యాంకు శాఖగా రూపుదిద్దుకోవడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభంలో ఒకే గదిలో ఇరుకుగా ఉన్న ఎక్స్‌టెన్షన్ కౌంటర్‌ను ప్రస్తుతం పూర్తిస్థాయి బ్యాంకు శాఖగా స్థాయిపెంచి భవనాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

సెంట్రల్ ఏసీ సౌకర్యం కూడా కల్పించారు. బ్యాంకు శాఖను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకులో డిపాజిట్లు సేకరించడంతో పాటు బంగారం తాకట్టుపై రుణాలు కూడా ఇస్తారన్నారు. వ్యక్తిగత రుణాలు కూడా పొందవచ్చని, ప్రభుత్వ చలానాల చెల్లింపులన్నీ ఈ బ్యాంకు శాఖ నుంచే జరుగుతున్నాయని వెల్లడించారు. బ్యాంకు సేవలను ప్రకాశం భవనంలోని ఉద్యోగులతో పాటు పరిసరాల్లోని ప్రజలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకు శాఖకు అనుబంధంగా రెండు ఏటీఎంలు, ఒక క్యాష్ డిపాజిట్ మిషన్ (సీడీఎం) ఏర్పాటు చేసేందుకు కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో స్థలాన్ని సమకూర్చేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు.

 త్వరలో 11 ఏటీఎంలు...
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు శాఖలకు అనుబంధంగా త్వరలో 11 ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు ఆ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజుక్తారాయ్‌గురు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు శాఖ ఆవరణలో ఏటీఎం ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ స్థలం సరిపోకపోతే కనీసం 500 మీటర్లలోపు ఏటీఎంను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ మిషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కందుకూరు, కనిగిరి, కంభం, ఒంగోలు అంజయ్యరోడ్డు, కలెక్టరేట్ శాఖల వారీగా 6 ఏటీఎంలు, 5 క్యాష్ డిపాజిట్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖాతాదారులకు 24 గంటల పాటు నగదు లావాదేవీలు, డిపాజిట్లు, విత్‌డ్రాలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఒంగోలు కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఏటీఎంలు, సీడీఎంల ఏర్పాటుకు స్థలం సమకూర్చాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టరేట్ బ్యాంకు శాఖను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఆ శాఖ మేనేజర్ రాంబాబును డీజీఎంతో బ్యాంకు రీజినల్ మేనేజర్ కేఎస్‌ఆర్ మూర్తి, కలెక్టర్ అభినందించారు.

 వ్యక్తిగత రుణాలివ్వాలి...
 కలెక్టరేట్ శాఖలో ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలివ్వాలని ఎన్‌జీవో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా అధ్యక్షులు నాసర్ మస్తాన్‌వలి, మాలకొండయ్యలు ఆ బ్యాంకు డీజీఎం, ఆర్‌ఎంలను కోరారు. రుణాల మంజూరుకు అదనపు సిబ్బందిని నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. రుణాలిచ్చేందుకు డీజీఎం, ఆర్‌ఎంలు అంగీకరించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో ఎస్.మురళి, వెలిగొండ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు, జేడీఏ దొరసాని, బ్యాంకు ఆఫీసర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కె.కిశోర్‌కుమార్, కె.కృష్ణ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు