ఆస్పత్రి ఆధునికీకరణకు రూ. 23 కోట్లు

27 Dec, 2013 05:47 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 23 కోట్ల నాబార్డు నిధులు విడుదల చేసిందని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ అన్నారు. గురువారం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఆయన భవన నిర్మాణాలు చేపట్టాల్సిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ నాబార్డు నిధులతో భవన నిర్మాణాలతో పాటు ఆహ్లాదాన్నిచ్చే మొక్కలు నాటాలని, ఆస్పత్రిని సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. లే-అవుట్ ఫిక్షేషన్‌లో నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆస్పత్రి ఆవరణ అందంగా తీర్చిదిద్దేందుకు లాన్‌గ్రాస్, కూర్చునేందుకు బల్లాలు, అందమైన మొక్కలు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు ఉండాలని హార్టీకల్చర్ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు, స్టోర్‌రూంలు ఉండేలా, ఆస్పత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ముఖ్యమైన మౌళిక సదుపాయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు జిల్లా వైద్యాధికారి పి పుల్లయ్య, ఏపీఓ అగ్రికల్చర్ వై నారాయణరావు, టీఏ బీవీవీ గోపాలరావు, యుగంధర్, శ్రీనాధ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు