మేజర్ల ఆధునికీకరణ మమ!

26 Oct, 2015 01:25 IST|Sakshi
మేజర్ల ఆధునికీకరణ మమ!

పనుల్లో బయటపడుతున్న డొల్లతనం
సగం పైగా బిల్లులు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లు
గ్రావెల్‌కు బదులు నల్లమట్టి..
 చిట్టడవిని తలపిస్తున్న కరకట్టలు
 ఆందోళనలో రైతులు

 
పల్నాడులోని ఎనిమిది మేజర్ కాల్వల ఆధునికీకరణ పనులు అధ్వానంగా ఉన్నాయి. గ్రావెల్ పోసి రోలర్ తిప్పి చదును చేయాల్సినచోట కాల్వలో తీసిన మట్టిని పోశారు. కొలతల ప్రకారం వెడల్పు చేయలేదు. లోతు తీయడంలో నిబంధనలు పాటించడంలేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పర్సంటేజీలు తీసుకుని మిన్నకుండి పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
కారంపూడి: కారంపూడి ఓఅండ్‌ఎం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎనిమిది మేజర్ల ఆధునికీకరణకు రూ.22 కోట్లు కేటాయించారు. డీసీ-3 పరిధిలోని రామాపురం, మిరియాల, చర్లగుడిపాడు మేజర్ల ఆధునికీకరణకు రూ.13 కోట్లు, కేసానుపల్లి, పెదకొదమగుండ్ల, జానపాడు, గుత్తికొండ, కోటనెమలిపురి మేజర్లకు రూ.తొమ్మిది కోట్లతో రెండేళ్ల క్రితం పనులు ప్రారంభయ్యాయి. మొదటి దశలో కరకట్టలపై కంప తొలగించడం, కాల్వ లోతు తీయడం, కరకట్టలను పట్టిష్టం చేసి వెడల్పు పెంచడం లాంటి పనులు పూర్తయ్యాయనిపించారు. దాదాపు రూ.12 కోట్ల వరకు బిల్లులు డ్రా చేశారు.

నిబంధనలకు నీళ్లు..
అయితే ఈ పనులు అధ్వానంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీబీలతో కాల్వల లోపల, కరకట్టలు గీరుకుంటూ వెళ్లారు. కాల్వలో తీసిన  మట్టిని కట్టపై పోశారు. కాల్వ పక్కన లభ్యమైన నల్ల మట్టినే కట్టలపై పోసి సరిచేశారు. వాస్తవంగా గ్రావెల్ పోసి రోలర్ తిప్పి చదును చేయాలి. గ్రావెల్ తెచ్చి పోయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఎక్కడ మట్టి అక్కడే సరి చేశారు. కరక ట్టలను ఆరు, మూడు మీటర్లు చొప్పున వెడల్పు చేయాల్సి వుండగా అది చాలా చోట్ల జరగలేదు. కాల్వ లోతు తీయడంలోనూ నిబంధనలు పాటించలేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పర్సంటేజీలకు ఆశపడడంతో పనులపై పర్యవేక్షణ కొరవడిందని అంతా ఆరోపిస్తున్నారు. అసలు కాంట్రాక్టర్లకు లాభం ఇచ్చి పలువురు సబ్ కాంట్రాక్టులకు తీసుకోవడం నాణ్యతా లోపాలకు మరో కారణం. క్వాలిటీ కంట్రోల్ అధికారుల పనితీరు కూడా ఇక్కడ ప్రశ్నార్ధకం అవుతోంది.

బయట పడుతున్న డొల్లతనం...
ఆ పనుల మొత్తాన్ని పరిశీలిస్తే.. పెదకొదమగుండ్ల మేజర్ కాల్వ కట్టలపై కంపచెట్లు అడవిని తలపిస్తున్నాయి. కొద్దిపాటి వానకే కర కట్టలు బురదమయం అవుతున్నాయి. రామాపురం మేజర్ కాల్వ పరిస్థితి మరీ దారుణంగా వుంది. మిగతా మేజర్లది దాదాపు ఇదే పరిస్థితి. ఇటీవల మెయిన్ కెనాల్‌కు తాగునీరు వదిలినప్పుడు కొదమగుండ్ల మేజర్‌కు షట్టర్ లేక కాల్వకు నీరు వచ్చింది. ఆ నీరు అర కిలోమీటరు లోపే లీకుల ద్వారా బయటకు పోయింది. గతేడాది పూర్తి స్థాయిలో నీరు వదిలితే ఒక్క పీకేజీ మేజర్‌కే మెయిన్ కెనాల్ నుంచి ఎన్‌ఎస్పీ కాలనీ వరకు నాలుగుసార్లు గండ్లు పడ్డాయి. నీరు సరిగా ముందుకు పారక నీరు కరకట్టలపై పారాయి. కాల్వల లోపల కూడా చెట్లు పెరిగాయి. ఇలా అయితే మేజర్ల పరిధి లో పెరిగిన ఆయకట్టుకు నీరు అందడం అసాధ్యం. ఎంతోకాలంగా నీరందక ఇబ్బంది పడుతున్న చివరి భూముల రైతుల సమస్యలు తీరేలా లేవు. నూతన సాగు నీటి సంఘాలు పనులు సక్రమంగా జరిగేలా శ్రర్ధ చూపాల్సిన అవసరం వుంది.

 ఐదేళ్ల వరకు కాంట్రాక్టర్‌దే బాధ్యత..
 కాల్వలకు గండ్లు పడినా, ఇతర నాణ్యతా లోపాలకు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలి. ఐదు సంవత్సరాల వరకు కాల్వల మరమ్మత్తులు వారే చేయాలి. కాల్వ కట్టలపై జంగిల్ క్లియరెన్స్ చేయిస్తాం.         
 - నాగేశ్వరావు, ఏఈ, ఎన్‌ఎస్‌పీ
 

మరిన్ని వార్తలు