మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న మోదీ ప్రభుత్వం

26 Feb, 2015 00:43 IST|Sakshi

సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ
 

 యర్రగొండపాలెం: మోదీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని సీపీఐ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఆ పార్టీ జిల్లా మహాసభల సందర్భంగా బుధవారం స్థానిక కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. మత సామరస్యానికి చిహ్నమైన భారతదేశంలో సంఘ్‌పరివార్ మతోన్మాదంతో రెచ్చిపోతోందన్నారు.  బీజేపీ దూకుడుకు ఢిల్లీ ఎన్నికలు బ్రేక్ వేశాయన్నారు. ఈ పరిణామానికి అన్నీ రాజకీయ పార్టీలు సంతోషపడ్డాయని, కానీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాత్రం బాధపడ్డారన్నారు.

దేశం అభివృద్ధి కావాలంటే మోదీ నాయకత్వం అవసరమని ఆయన చెప్పడం వింతగా ఉందన్నారు. పెట్టుబడిదారులకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని రామకృష్ణ విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లోని నల్లడబ్బును వంద రోజుల్లో వెనక్కి తెప్పిస్తామని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నల్లకుబేరుల పేర్లను బయట పెట్టమంటే ద్వైపాక్షిక ఒప్పందం ఉందని, అందుకు తాము పేర్లు బయటపెట్టలేమన్నారని అన్నారు.

ఎన్నికల సమయంలో మోదీని ప్రధానిగా చేయటానికి కార్పొరేట్ కంపెనీలు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని ఆయన వివరించారు. మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రత్యేక విమానంలో అదానీ కంపెనీ వారు ఉన్నారన్నారు. విదేశాల్లో మైనింగ్ వస్తే ఇక్కడ భారతీయ స్టేట్ బ్యాంకు వారిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి రూ.61 వేల కోట్ల రుణాలు ఇప్పించారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని  విమర్శించారు.

రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారని,  రాష్ట్ర ప్రభుత్వం రూ.23,500 కోట్లు ప్రతిపాదనలు పంపితే రూ.350 కోట్లు ఇచ్చారన్నారు.  చంద్రబాబునాయుడు కేంద్రాన్ని నిలదీయటానికి సుముఖంగా లేరన్నారు. సిగ్గులేకుండా మోదీ జపం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబునాయుడు విస్మరించారన్నారు.  ముందుగా సీపీఐ జిల్లా 14వ మహాసభల జెండాను సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు టీసీహెచ్ చెన్నయ్య ఎగురవేశారు.

ప్రతినిధుల సభకు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్‌డీ సర్దార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కే అరుణ, సహాయ కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, ఎంఎల్ నారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు