ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను కాలరాసిన చంద్రబాబు : మోదీ

2 Jan, 2019 18:42 IST|Sakshi

సాక్షి, అమరావతి:  కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటప్పుడు గత నాలుగున్నరేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయనను ఒక అబద్ధాలకోరుగా మోదీ అభివర్ణించారు. బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఇలాంటి తప్పుడు ప్రచారమంతా.. నిజం(వాస్తవం) అనే సునామీలో కొట్టుకుపోక తప్పదని అన్నారు. రాష్ట్రంలోని కాకినాడ, మచిలీపట్నం, నరసాపురం, విశాఖపట్నం, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గాల్లోని బీజేపీ బూత్‌ కమిటీ నాయకులతో మోదీ బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. దాదాపు గంటపాటు పార్టీ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గరివిడి మండల బీజేపీ అధ్యక్షుడు అడిగిన ప్రశ్నకు మోదీ బదులిస్తూ... ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో నాకు తెలుసు. మీ బాధ కూడా తెలుసు. బీజేపీపై, కేంద్రంపై విమర్శలు చేస్తున్న ఆయన(చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా) ఏ హామీని అమలు చేశారో చెప్పమనండి. నాపై మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఆయన ఏదైనా కొంతచేసి ఉంటే ఇంకొకరిని విమర్శించడానికి అవకాశం ఉంటుంది. అతను చేసింది చూపించడానికి ఏమీ లేకపోగా అసత్యాలను మాత్రమే చెబుతున్నారు. తాను ఏమీ చేయకుండానే పక్కవారిపై విమర్శలు చేయడానికి అసక్తి ప్రదర్శిస్తున్నారు’’అని చురకలంటించారు. ఆయన కుంభకోణాల్లో(స్కామ్‌లు) నిండా మునిగిపోయారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  

‘పోలవరం’లో రాష్ట్ర సర్కారు అసమర్థత  
ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం రూ.23,000 కోట్ల సాయం అందజేసిందని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాలేదని చెబుతున్న వాళ్లను ఆ నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్నించాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ఈ నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన నిధులు ఎక్కడికి వెళ్లాయో ప్రశ్నించాలన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇచ్చినా సరైన సమయంలో సక్రమంగా ఖర్చు పెట్టలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ దాని నిర్మాణానికి కేంద్రం వంద శాతం ఆర్థిక సహాయం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.7 వేల కోట్లు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా దాని నిర్మాణం చేపట్టడం లేదని విమర్శించారు. పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను ‘కాగ్‌’తప్పుపట్టిందని మోదీ గుర్తుచేశారు.  

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి..:  రాష్ట్రంలో 10 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేశామని, గతంలో అధికారంలో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థను కూడా మంజూరు చేయలేదన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని ప్రధాని మోదీ సూచించారు. స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా ఏపీలో 38 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులిచ్చామన్నారు. పీఎంజీఎస్‌వై పథకంలో 2,000 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించినట్టు చెప్పారు. రెండు లక్షల మంది మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు, రెండున్నర లక్షల మంది ఉపాధి కోసం శిక్షణ, ఆరు లక్షల ఇళ్లు, ముద్రా పథకంలో రూ.7 వేల కోట్ల రుణాలు రాష్ట్ర ప్రజలకు కేంద్రం సాయం చేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రతి కార్యకర్త ఒక ఆయుధమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు