కిరాతకుడు రఫీకి ఉరి

1 Mar, 2020 04:16 IST|Sakshi

‘పోక్సో’ చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో తొలి తీర్పు

సాక్షి, అమరావతి:  అభం, శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యంత హేయంగా లైంగిక దాడికి పాల్పడి, కిరాతకంగా హత్య చేసిన మహమ్మద్‌ రఫీకి(25) ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు నగరంలోని పోక్సో న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. పసి పిల్లలపై లైంగిక దాడులు, బాలికలపై అత్యాచారాలు, ప్రేమను అంగీకరించని వారిపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కిరాతకుడైన రఫీని ఉరి తీయాలంటూ పోక్సో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అభినందనీయమని అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఆడుకుంటున్న చిన్నారిపై... 
చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి గతేడాది నవంబర్‌ 7వ తేదీ రాత్రి కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీలో జరిగిన ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలసి వెళ్లింది. భోజనాలు చేసిన తర్వాత ఆడుకుంటూ ఒంటరిగా కన్పించిన బాలికకు మదనపల్లెకి చెందిన లారీ డ్రైవర్‌ మహ్మద్‌ రఫీ(25) ఐస్‌క్రీమ్‌ ఇప్పిస్తానని ఆశ చూపించి కల్యాణ మండపంలో ఉన్న బాత్‌రూమ్‌కు తీసుకెళ్లాడు. అరవకుండా నోరు నొక్కాడు. పాశవికంగా లైంగిక దాడి చేశాడు. తర్వాత బాలిక గొంతు నులిమి చంపేసి, శవాన్ని కల్యాణ మండపం పక్కన గుంతలో పడేసి పారిపోయాడు. పోలీసులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

పట్టించిన సీసీ కెమెరా... 
కల్యాణ మంటపంలోని సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారించగా రఫీ చేసిన దారుణం బట్టబయలైంది. రఫీని 2019 నవంబర్‌ 16న అరెస్టు చేశారు. మదనపల్లె జూనియర్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. రఫీ తన 15వ ఏటే ఓ బాలికపై అత్యాచారయత్నం చేసినందుకు కొన్నాళ్లు జువెనైల్‌ హోమ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. నేర ప్రవృత్తి మానకుండా అమానుషానికి పాల్పడిన రఫీకి న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు.

జగన్‌ సర్కారు చొరవతో... 
తెలంగాణలో దిశ కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ చిన్నారి హత్యకేసు విచారణను చిత్తూరులోని పోక్సో కోర్టులో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా లోకనాథరెడ్డిని నియమించింది. గతేడాది డిసెంబర్‌ 12న విచారణ ఆరంభించిన పోక్సో కోర్టు నిందితుడు రఫీ అరెస్టయిన వంద రోజుల్లోనే విచారణ పూర్తిచేసి ఉరిశిక్ష విధించింది. నిందితుడు రఫీ భార్య సైతం ఈ తీర్పును సమర్థించడం గమనార్హం. ఇలాంటి తీర్పులు వస్తే తప్పు చేయడానికి ఎవరైనా భయపడతారని, దీనివల్ల అఘాయిత్యాలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు