ఆయన్ని పిలవకపోవడం సరికాదు: మోహన్‌బాబు

27 Jan, 2019 19:19 IST|Sakshi

సాక్షి, పాలకొల్లు: దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఆహ్వానించకపోవడాన్ని సినీ నటుడు మోహన్‌బాబు తప్పుబట్టారు. ఆయనను పిలవకపోవడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం ముద్రగడను మోహన్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ తనకు మంచి మిత్రుడని, ఆయనతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తెలిపారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని, ముద్రగడ కూడా ఏ పార్టీలోనూ లేరని చెప్పారు. ‘అనుకున్నది సాధించాలన్న పట్టుదల గల వ్యక్తి ముద్రగడ. తనను నమ్ముకున్నవారిని ద్రోహం చేయకుండా అందరికీ మంచి చేయాలనే వ్యక్తిత్వం కలిగిన ముద్రగడ ఈ ప్రాంతంలో ఉండటం గర్వకారణమ’ని మోహన్‌బాబు అన్నారు.

శనివారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్‌లో దాసరి కాంస్య విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఇందులో మోహన్‌బాబుతో పాటు మురళీమోహన్‌, శ్రీకాంత్‌, శివాజీరాజా, కవిత, హేమ, ప్రభ, సి. కళ్యాణ్‌, రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, రాజా వన్నెంరెడ్డి, రవిరాజా పినిశెట్టి, చోటా కె నాయుడు, సురేశ్‌  కొండేటి తదితరులు పాల్గొన్నారు.

దాసరి బయోపిక్‌ తీస్తే సహకరిస్తా
దర్శకరత్న, తన గురువు దాసరి నారాయణరావు బయోపిక్‌ను ఎవరైనా తెరకెక్కిస్తే పూర్తిగా సహకరిస్తానని మోహన్‌బాబు అంతకుముందు చెప్పారు. దాసరి జీవితచరిత్రను సినిమా తీసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎవరైనా ముందుకు వస్తే తాను పూర్తిగా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. సినీ జగత్తులో దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, తనలాంది వందల మంది కళాకారులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని గుర్తు చేశారు. దర్శకుడికి హీరో ఇమేజ్‌ తీసుకొచ్చిన ఘనత దాసరికే చెందుతుందన్నారు.

మరిన్ని వార్తలు