తిరుపతిలో మోహన్‌ బాబు ధర్నా

22 Mar, 2019 09:34 IST|Sakshi

సాక్షి, తిరుపతి : సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మోహన్‌ బాబును హౌస్‌ అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలంటూ శుక్రవారం తిరుపతిలో ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఫీజు  రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఆయన శ్రీవిద్యా నికేతన్‌ సంస్థల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చదవండి....(చంద్రబాబు ఇచ్చినమాట నిలబెట్టుకో: మోహన్‌ బాబు)

ఈ నిరసనను అణిచి వేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ...మోహన్‌ బాబును గృహ నిర్భందం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోను తన నిరసన కొనసాగిస్తానంటూ మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉంచారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి  శ్రీవిద్యా నికేతన్‌కు సుమారు రూ.17కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రావాలి. ఎన్నోసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టా’. అని తెలిపారు.  చదవండి...(ఆస్తులు తాకట్టుపెట్టి కాలేజీని నడపాల్సి వస్తుంది!)

కాగా చంద్రబాబు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పదివేల మంది విద్యార్థులతో తిరుపతి లీలామహల్‌ సర్కిల్‌ నుంచి గాంధీ రోడ్డు వరకూ విద్యార్థులతో కలిసి మోహన్‌ బాబు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే తిరుపతి రూరల్‌ రంగంపేటలోని విద్యానికేతన్‌ విద్యాసంస్థల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు మోహన్‌ బాబు ధర్నాతో తిరుపతి-పీలేరు రహదారిలో సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు