బాపూజీ.. మన్నించు!

30 Jan, 2019 13:44 IST|Sakshi

నేడు గాంధీజీ వర్ధంతి సందర్భంగా

సాక్షి ప్రతినిధి, కడప : మహాత్మా!..మీరు పరమపదించి ఏడు దశాబ్దాలు దాటిపోతున్నా ఆనాడు మీరు నేర్పిన భావాలు చరిత్ర పుటల్లో చెక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రం మా పాలకులు అడుగడుగునా నిన్ను అవమానిస్తున్నారు. బాపూజీ క్షమించు.. క్షమించు..

♦  నాయకుడు ఎలా ఉండాలో మీరు నేర్పించి వెళ్లారు. కానీ అలాంటి నాయకత్వం మచ్చుకైనా కనిపించని ఈ నాయక గణాన్ని మరోమారు క్షమించు బాపూజీ..
♦  బానిస సంకెళ్లతో కట్టుబానిసలుగా మగ్గుతున్న మాకు స్వాతంత్య్రం కల్పించడానికి బ్రిటీషు పాలకులపై మీరు ప్రయోగించిన ఆయుధాలు సత్యం, అహింస..
♦  అయితే, నేటి స్వతంత్ర భారతావనిలో మళ్లీ మళ్లీ అధికారం చేజిక్కించుకోవడానికి ప్రస్తుత పాలకులు అమాయక ప్రజలపై వదులుతున్న బాణాలు మోసం,దగా.. ఎంత తేడా..
♦  ఒంటిపై ముతక కొల్లాయి ధరించి ప్రతిరోజు పాయఖానాను శుభ్రపరిచిన మీకు.. మచ్చుకైనా నలగని ఖరీదైన ఖద్దరు దుస్తులతో దుమ్ము చేతికంటని ప్లాస్టిక్‌ పొరకను చేతబట్టి ఫొటోలకు ఫోజులిస్తున్న నేటితరం నేతలకు.. అసలు పోలికలు ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

♦  మహాత్మా పగటి వేషాలు ఒంట పట్టించుకుని పబ్బం గడుపుకుంటున్న మా పాలకుల్లో కాసింతైనా మార్పు తెప్పించవా.. దళితులను హరిజనులంటూ గౌరవించి అక్కున చేర్చుకున్న మీకు.. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా.. దళితులు అస్సలు శుభ్రంగా ఉండరంటూ వినడానికి సైతం కర్ణ కఠోరంగా, లెక్కలేని తనంగా మాట్లాడుతూ దళితుల మనుసుల్లో మానని గాయాలు చేస్తున్న నేటి తరం పాలకులకు అస్సలు పొంతన లేదు... నీ వర్ధంతి రోజైనా వారికి జ్ఞానోదయం కలిగించు బాపూజీ..

♦  అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచి వెళ్లగిలిగిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని చెప్పారు... అర్ధరాత్రి మాటేమోగానీ పట్టపగలే బాలికలు నిర్భయంగా బళ్లకు వెళ్లడానికి భద్రత కల్పించలేని ప్రభుత్వాలను చూస్తున్నాం. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు తన శిష్యురాలి ఇంటి మొబైల్‌కు అసభ్యకర సందేశాలు, నీలి చిత్రాలు పంపిస్తున్న సంఘటనలు వింటుంటే నిజంగా నీ ఆత్మ ఎంత క్షోభిస్తుందో తలుచుకుంటూనే మా గుండెలు తరుక్కుపోతున్నాయి బాపూజీ..

♦  సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఏనాటికైనా మనవాళ్లు కచ్చితంగా అమలు చేయగలరన్న నీ చిరకాల కోరికను మంట గలుపుతున్నందుకు మా పాలకులను మరొక్కమారు క్షమించు బాపూజీ..
సంక్షేమ పథకాలంటూ పేద ప్రజలకు ఓ చేత్తో చిల్లరను వెదజల్లి.. మరోచేత్తో వారి కష్టార్జితాన్నంతా లాక్కోవడానికి పట్టణాల్లో వీధివీధికి మద్యం దుకాణాలు, పల్లెల్లో సందుసందున బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్న నేటి పాలకులను మనసారా క్షమించు బాపూజీ..
♦  పైకి మాత్రం మీ ఆశయాలను సాధించడానికే రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్పి లోపల మాత్రం తమ సొంత ఆశలు, కోరికలను నెరవేర్చుకుని అమూల్యమైన మీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న మా నాయకులను మన్నించు బాపూజీ..!

మరిన్ని వార్తలు