మోక్షమెప్పుడో..!

28 Jan, 2015 03:12 IST|Sakshi
మోక్షమెప్పుడో..!

జమ్మలమడుగు: జిల్లా ప్రజలకు ఎర్రగుంట్ల - నంద్యాల రైలు ఓ కలగా మారుతోంది. ఈ రైలుకు మోక్షమెప్పుడు వస్తుందా అని ఈ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్నారు. ఎర్రగుంట్ల-నంద్యాల రైలుమార్గం 1996-97లో మంజూరైంది. 126 కిలోమీటర్ల పరిధిలో రూ.883 కోట్ల అంచనా వ్యయంతో మార్గం పనులు ప్రారంభమయ్యాయి. 2012 వరకు రూ.558 కోట్లు ఖర్చు చేశారు. పెండింగ్‌లో 30 కిలోమీటర్ల లైను మిగిలి ఉంది. ఇరవై శాతం పనులు ఈ మార్గం కోసం చేపట్టాల్సి ఉంది.
 
2012-13లో రూ.63కోట్లు కేటాయించారు. 2013-14లో రూ.30కోట్లు కేటాయించారు. బనగానపల్లె వరకు రైలుపట్టాలు నిర్మితమయ్యాయి. నంద్యాల వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం నొస్సం వరకు పనులు జరుగుతున్నాయి. రైలు మార్గం మంజూరై 17 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తికాలేదు. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే రూ.300 కోట్లు కావాల్సి ఉంది.

ఈ పనులు పూర్తయితే కడప - కర్నూలు జిల్లాల మధ్య ప్యాసింజర్ రైలు నడవనుంది. 2012 మార్చి నాటికే పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలు కొనసాగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా పనులు మాత్రం మందకొడిగా సాగుతూనే ఉన్నాయి. కనీసం ఎర్రగుంట్ల - బనగానపల్లె వరకు ప్యాసింజర్ రైలు నడిపే అవకాశం ఉన్నా దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.  
 
1996-1997లో అప్పటి రైల్వే మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్ హయాంలో రూ.167 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం ఈ అంచనా రూ.470 కోట్లకు చేరింది. గత బడ్జెట్‌లో ఈ రైలు మార్గానికి రూ. 40కోట్ల కేటాయింపులు జరిగాయి. జిల్లాలో యర్రగుంట్ల నుంచి కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం సమీపం వరకు లైన్ నిర్మాణం, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, రైల్వేస్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్ పూర్తయ్యాయి. 50 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ రూపుదిద్దుకుంది.


ఈ మార్గంలో యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు, నంద్యాల ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు ఉంటాయి. నొస్సం నుంచి నంద్యాల వరకు రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. క్రాసింగ్ వంతెనలు, స్టేషన్ల నిర్మాణంలో పురోగతి అటకెక్కింది.

నొస్సం నుంచి బనగానపల్లె మండలంలోని పండ్లాపురం వరకు ఎర్త్ పనులు పూర్తికాలేదని సమాచారం. జుర్రేరు, పాలేరు, కుందూ నదులపై వంతెనలతో పాటు, 45 లెవల్ క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తికావాలంటే రెండేళ్లు పడుతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కోవెలకుంట్ల వరకు పూర్తి చేసిన 82 కిలోమీటర్ల రైల్వేలైనులో పలుమార్లు ట్రయల్న్ ్రవిజయవంతంగా నిర్వహించారు.
 
దాల్మియా కోసం..
ఎర్రగుంట్ల - నంద్యాల మధ్య ప్యాసింజర్ రైలు వస్తుందని గత నాలుగు దశాబ్దాలుగా  ఈ ప్రాంతవాసులు ఆశపడ్డారు. అయితే ప్యాసింజర్ రైలు రాలేదు గాని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కోసం రైల్వే అధికారులు గూడ్స్‌రైలు నడుపుకోవటానికి అనుమతులు ఇచ్చారు. దీంతో అప్పుడప్పుడు ఈప్రాంత వాసులకు గూడ్స్‌రైలు దర్శనమిస్తోంది. మరి ప్యాసింజర్ రైలు ఎప్పుడు వస్తుందోననే ఆతృతతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు