ముసుగు వీడేనా..!

28 May, 2018 08:39 IST|Sakshi
రుయా చిన్నపిల్లల ఆస్పత్రి భవనం

రుయాలో లైంగిక వేధింపులపై ముగిసిన విచారణ

మరో రెండు రోజుల్లో  కలెక్టర్‌కు నివేదిక

10 రోజులు కొనసాగిన కమిటీ విచారణ

ఆ ముగ్గురు వైద్యుల్లో మొదలైన టెన్షన్‌

తిరుపతి (అలిపిరి) : ఎస్వీ మెడికల్‌ కళాశాల పిడియాట్రిక్‌ పీజీ ఫైనలియర్‌ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వైద్యులపై చేపట్టిన విచారణ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ పది రోజుల పాటు వైద్యులను, విద్యార్థులతోపాటు బాధితురాలిని విచారించింది. కమిటీ సభ్యులు మరో రెండు రోజుల్లో నివేదికను జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్నకు అందజేయనున్నారు. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుల్లో టెన్షన్‌ మొదలైంది.

పకడ్బందీగా విచారణ
ఎస్వీ మెడికల్‌ కళాశాల పిడియాట్రిక్‌ వైద్యుల లైంగిక వేధింపుల ఆరోపణలపై జిల్లా కలెక్టర్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో చిత్తూరు అడిషనల్‌ ఎస్పీ, ఐసీడీఎస్‌ పీడీ, డీఎం అండ్‌ హెచ్‌వో, తిరుపతి ఇన్‌చార్జ్‌ ఆర్డీవో, తుడా సెక్రటరీ ఉన్నారు. ఈ కమిటీ విచారణను పకడ్బందీగా చేపట్టింది. పిడియాట్రిక్‌ వైద్యులు, విద్యార్థులు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు బాధిత విద్యార్థినిని విచారించింది. విచారణకు సంబంధించిన విషయాలు బయటకు పొక్కకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. విచారణకు సంబంధించిన నివేదికను మరో రెండు రోజుల్లో తుదిరూపునకు తీసుకొచ్చి కలెక్టర్‌కు సమర్పించనున్నారు.

పిడియాట్రిక్‌ విభాగాధిపతిపై ప్రత్యేక విచారణ
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ రవికుమార్‌ను కమిటీ ప్రత్యేకంగా విచారించింది. గతంలో ఆయన ప్రవర్తన తీరు ఎలా ఉంది,  ఆరోపణలు ఉన్నాయా.. అన్న కోణంలోనూ విచారణ చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు వైద్యులు డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శశికుమార్‌ను విడివిడిగా విచారించినట్లు సమాచారం. వైద్య విద్యార్థిని వెనుక ఒక ప్రొఫెసర్‌ ఉండి రెచ్చగొట్టడం వల్లే తమపై ఇలా ఆరోపణలు చేసినట్లు సంబంధిత వైద్యులు చెప్పుకొచ్చినట్లు సమాచారం. కొందరు పిడియాట్రిక్‌ వైద్య విద్యార్థులు సాక్షితో మాట్లాడుతూ కమిటీ లైంగిక వేధింపులపై ప్రశ్నించినప్పుడు వైద్యులు విద్యార్థినులపై మండిపడడం సహజమేనని, లైంగిక వేధింపులు జరిగాయా అన్నది తమకు తెలియదని చెప్పుకొచ్చారు.

వైద్యులను కాపాడే ప్రయత్నం
లైంగిక వేధింపులపై ఎస్వీ మెడికల్‌ కళాశాల పిడియాట్రిక్‌ వైద్య విద్యార్థిని గవర్నర్‌కు లేఖ రాయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ ఆదేశాల మేరకు ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమణయ్య అధ్యక్షతన సీనియర్‌ వైద్యులు జమున, జయాభాస్కర్, సిద్ధానాయక్‌ ఈ నెల ఒకటో తేదీ నుంచి వారం రోజులు విచారణ చేపట్టారు. కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్‌ రమణయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ రవికుమార్, డాక్టర్‌ కిరీటి, డాక్టర్‌ శశికుమార్‌కు అనుకూలంగా ప్రకటన చేసి నివేదికను లీకు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టారు. ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్‌ రమణయ్య, ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ కిరీటీలదీ తెనాలి కావడంతో సహచర బృందాన్ని ఎలాగైనా కాపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌కు నివేదిక అందిన తరువాత నేరుగా చర్యలు తీసుకుంటారా..? వైద్య ఆరోగ్య శాఖకు రెఫర్‌ చేస్తారా..? హెల్త్‌ వర్సిటీ వీసీకి పంపుతారా.. అన్నది తెలియాల్సి ఉంది.

మూడేళ్లుగా వేధించిన తీరును వివరించా
మూడేళ్లుగా తనను లైంగికంగా వేధించిన తీరును కమిటీకి వివరించా. అసలు పిడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ రవికుమార్‌ ఒక ప్రొఫెసర్‌గా అనర్హుడని చెప్పా. నా దగ్గర ఉన్న సాక్షాలను కమిటీకి అందజేశా.
    – పిడియాట్రిక్‌ వైద్య విద్యార్థిని, ఎస్వీఎంసీ, తిరుపతి

మరిన్ని వార్తలు