మూడో రోజూ నిరాశే

17 Jul, 2018 03:50 IST|Sakshi
గల్లంతైన వారి కోసం గోదావరిలో నేవీ హెలికాప్టర్‌తో గాలిస్తున్న దృశ్యం

     లభ్యంకాని అందరి ఆచూకీ 

     సోమవారం ఒక విద్యార్థిని మృతదేహం లభ్యం

     నిరంతరాయంగా గాలింపు బృందాల అన్వేషణ

సాక్షి, రాజమహేంద్రవరం/ముమ్మిడివరం/ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక వద్ద శనివారం పడవ బోల్తా ఘటనలో గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సముద్రం, నది కలిసే భైరవపాలెం మొగ వద్ద కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన తిరుకోటి ప్రియ (8వ తరగతి) మృతదేహాన్ని స్థానిక మత్య్సకారులు గుర్తించారు. ఆదివారం రాత్రి గల్లా నాగమణి అనే మహిళ మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి సోమవారానికి 3 రోజులవుతున్నా మిగతా ఐదుగురు విద్యార్థినుల జాడ కానరాకపోవడంపై వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనకు సంతాపంగా బాలికలు విద్యను అభ్యసిస్తున్న పశువుల్లంక పాఠశాల, మురముళ్ల మార్కెట్, దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. 

మొత్తం 19 బృందాలతో వెతుకులాట
గల్లంతైన సుంకర శ్రీజ, కొండేపూడి రమ్య, పోలిశెట్టి వీర మనీషా (పదో తరగతి), పోలిశెట్టి అనూష (తొమ్మిదో తరగతి), పోలిశెట్టి సుచిత్ర (ఆరో తరగతి)ల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఏపీ ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ, కోస్ట్‌గార్డ్స్, అగ్నిమాపక దళం, ఏపీఎస్పీఎఫ్, డీప్‌ డైవర్స్‌ 160 మంది 19 బృందాలుగా విడిపోయి నదిలో గాలిస్తున్నాయి. వీరికి అదనంగా స్థానిక మత్స్యకారులు ఇంజిన్‌ పడవలతో అన్వేషిస్తున్నారు. నాలుగు డ్రోన్‌ కెమెరాలు, నేవీ హెలికాప్టర్‌ కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ప్రమాదం జరిగిన పశువుల్లంక నుంచి యానాం మీదుగా గౌతమీ నది సుమారు 22 కిలోమీటర్లుంది. ఈ ప్రాంతాన్ని గాలింపు బృందాలు జల్లెడ పడుతున్నాయి. నదికి ఇరువైపుల అంచుల్లో మృతదేహాలు చిక్కుకునే అవకాశం ఉండటంతో వెతుకుతున్నారు.

సముద్రంలోకి కొట్టుకుపోయే అవకాశం
చనిపోయిన వారి మృతదేహాలు 24 గంటలకు ఉబ్బి నీటిలో తేలతాయని అధికారులు, మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు. తిరుకోటి ప్రియ మృతదేహం సముద్రం సమీపంలో దొరికింది. ప్రస్తుతం గోదావరిలో వరద మొదలైంది. గత కొద్దిరోజుల నుంచి మొదలైన వరద క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం 3.5 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద, సోమవారానికి 4 లక్షల క్యూసెక్కులు దాటడంతో నదీ ప్రవాహం మరింత పెరిగింది. ఘటన జరిగిన ప్రదేశం సముద్రానికి సమీపంలోనే ఉంది. దీంతోమృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటాయన్న అనుమానాలు బలపడతున్నాయి.  కాగా, నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎన్డీఆర్‌ఎఫ్, ఏపీ ఎస్డీఆర్‌ఎఫ్‌ తెచ్చిన ఐఆర్‌బీ బోట్లతో ప్రయాణించలేకపోతున్నారు. మత్స్యకారుల ఇంజిన్‌ బోట్లు, యానాం టూరిజం విభాగానికి చెందిన టూరిజం బోట్ల సహాయంతో సిబ్బంది గాలిస్తున్నారు.  ఈ గాలింపు చర్యలను డిప్యూటీ సీఎం చినరాజప్ప, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు దాట్ల బుచ్చిరాజు, ముమ్మిడివరం వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్, పి.సతీశ్‌ కుమార్, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్‌గున్నిలు పర్యవేక్షించారు.

దుఖఃసాగరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు 
తమ పిల్లల జాడ తెలియక ఓ వైపు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతుంటే, ఆ విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులతోపాటు సహచర విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. ఆటపాటలతో కలసిమెలసి తిరిగే తమ స్నేహితురాళ్ల జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ బోరున విలపిస్తున్నారు.

మా స్నేహం మరువలేనిది
శ్రీజ, నేను ఐదేళ్లుగా ఒకే పాఠశాలలో కలిసి చదువుకుంటున్నాం. నోట్‌ బుక్స్‌ కొనాలన్నా, మరుసటి రోజు పాఠశాలకు డుమ్మా కొట్టేయాలన్నా ఇద్దరిదీ ఒకటే నిర్ణయం. ఆటపాటల్లో శ్రీజ చలాకీగా ఉండేది. శ్రీజ ఆచూకీ ఇంకా లభించకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నా. 
– జగడం దివ్యశ్రీ (పదో తరగతి)

బాగా చదవడానికి తపన పడేది
పోలిశెట్టి సుచిత్ర బాగా చదవడానికి తపన పడేది. రోజూ అతికష్టం మీద శేరుల్లంక నుంచి సుమారు రెండు కిలోమీటర్లు సైకిల్‌పై గోదావరి రేవు వరకూ వచ్చి, పడవపై గోదావరి దాటి, కిలోమీటర్‌ కాలినడకన పాఠశాలకు వచ్చేది. ఏ చిన్న డౌట్‌ వచ్చినా వెంటనే నివృత్తి చేసేది. ఎంతగానో సహకరించేది. 
– సఖిలే సుమ హాసిని (6వ తరగతి)

మీకంటే ముందే వెళ్లిపోతా
మీకు చదువు చెప్పే అవకాశం మూడేళ్లే ఉంది.. మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాలకు, ఊరికి మంచి పేరు తీసుకొని రావాలని నేను తరగతిలో హితబోధ చేశాను. వెంటనే పోలిశెట్టి అనూష నిలబడి ‘సర్‌...మీ కంటే ముందు మేమే వెళ్లిపోతాం’ అని అంది. అలా అన్న 3 రోజులుకే అనూష మా నుంచి దూరమైంది.    
– కంభంపాటి సూర్యనారాయణ (బయాలజీ ఉపాధ్యాయడు)

పడవ ప్రమాదానికి ముందు విద్యార్థుల వనం–మనం ప్రతిజ్ఞ
యానాం: పడవ ప్రమాదం జరగకముందు శనివారం ఉదయం స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినులు ‘వనం–మనం’ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తున్న ఫొటో అందరితో కన్నీరుపెట్టిస్తోంది. ఈ ఫొటోలో ముందు వరుసలో 4వ తరగతి విద్యార్థిని తిరుకోటి ప్రియ ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం ఉంది. గలైంతైన మిగిలిన విద్యార్థినులు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ప్రియ మృతదేహం సోమవారం స్ధానిక మత్స్యకారుల గాలింపులో లభ్యమైంది.

>
మరిన్ని వార్తలు