పైసా వసూల్‌ !

12 Sep, 2018 13:50 IST|Sakshi

గణేష్‌ పందిళ్ల అనుమతుల పేరిట అడ్డగోలు దందా

రూ.వేలల్లో వసూలు చేస్తున్న ప్రభుత్వ విభాగాలు

రూ.వెయ్యి ఇస్తేనే అగ్నిమాపక శాఖ అనుమతి?

పోలీసు మామూళ్లు ఇక సరేసరి..

పందిళ్లపై అధికార పార్టీ నేతల కన్ను  

సాక్షి, అమరావతిబ్యూరో :    వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా తాత్కాలిక పందిళ్లు వేసుకునేందుకు పైసలిస్తేనే అనుమతులు అన్న ధోరణిలో జిల్లాలో అడ్డగోలు దందాకు ప్రభుత్వ శాఖలు తెరదీశాయి. విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది ఉత్సవ విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు అత్యంత నిష్టతో జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా ఘనంగా జరుపుకోవడమే ఇటు పోలీసులకు, అటు అగ్నిమాపక శాఖ, విద్యుత్‌ శాఖ, పంచాయతీ/మున్సిపాలిటీ సిబ్బందికి వరంగా మారింది. అనుమతులు ఇచ్చే పేరిట ఒక్కో శాఖ ఒక్కో తీరున ప్రజల నుంచి పండుగ మామూళ్లను దండుకుంటున్న వైనం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.

పంచాయతీలో ఫీజు తక్కువ..బాధుడు ఎక్కువ
సాధారణంగా వినాయక ‘విగ్రహ ప్రతిష్ట పందిళ్లు’ ఏర్పాటు చేసుకోవడానికి, ఊరేగింపునకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు దరఖాస్తు పెట్టే ముందుగా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ నుంచి పంచాయతీ అయితే పంచాయతీ కార్యాలయంతో పాటు అగ్నిమాపక, విద్యుత్‌ శాఖల నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ఇదే అదనుగా ఆయా శాఖలు నిర్వాహకుల నుంచి ముక్కుపిండి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ నుంచి పందిళ్ల ఏర్పాటు కోసం ఎన్‌ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పంచాయతీకి రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఎన్‌ఓసీ కోసం రూ.100తో పాటు మరో రూ.500 చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి. లేదంటే కొర్రీలతో ఇబ్బందులు పెడుతున్నారు. 

అగ్నిమాపక శాఖ అడిగినంత ఇవ్వాల్సిందే..
పండుగకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదే సందర్భంలో వినాయక విగ్రహలు ఉంచే పందిళ్లు కూడా ఎలాంటి అగ్ని ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ నియమ నిబంధనలకు లోబడి ఈ పందిళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పందిళ్ల ఏర్పాటు సమయంలో ఈ శాఖ నుంచి కూడా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడే అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలంటే అడిగినంతా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. మంగళవారం విజయవాడ సెంట్రల్‌ జోన్‌ పరిధిలో ఉండే ఓ అగ్నిమాపక శాఖ కార్యాలయ సిబ్బంది దరఖాస్తుకు రూ.వెయ్యి డిమాండ్‌ చేయడం గమనార్హం. రూ.వెయ్యి ఇవ్వకుంటే అనుమతులు ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పడంతో చేసేదీ లేక దాదాపు 40 మందికిపైగా మామూళ్లు ఇచ్చి అనుమతి పత్రాలు తీసుకెళ్లినట్లు తెలిసింది.

విద్యుత్‌ శాఖది అదే తీరు..
తొమ్మిది రోజులు నిర్వహించే ఈ ఉత్సవాలకు విద్యుత్‌ శాఖది కీలక పాత్ర. ముఖ్యంగా చాలా చోట్ల ఈ పందిళ్లు విద్యుత్‌ కాంతులతో శోభాయమానంగా వెలుగొందేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం ఏకంగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. వాస్తవానికి విద్యుత్‌ శాఖకు ఓ వెయ్యి ఓల్టుల విద్యుత్తు కోసం అనుమతి తీసుకోవాలంటే రూ.100 చలానా, మీ సేవా సెంటర్‌కు రూ.45, వెయ్యి ఓల్టుల విద్యుత్తు వాడకానికి గానూ రూ.2,250 చెల్లించాలి. ఆ మొత్తం చెల్లించినా ఒక్కో దరఖాస్తుదారుడు పందిళ్ల ఎత్తు తదితరాలను బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు మళ్లీ అదనంగా సమర్పిస్తేనే అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీసు మామూళ్లు సరేసరి..
పందిళ్ల వద్ద మైక్‌ సెట్టు, ఊరేగింపు తదితరాలకు పోలీసు శాఖ నుంచి అనుమతి పొందాలి. ఈ అనుమతుల కోసం మైక్‌ కోసం రోజుకు రూ.100, ఊరేగింపు రోజున రూ.250 చెల్లించాలి. మిగిలిన శాఖలతో పోలిస్తే పోలీసు శాఖ వసూలు చేస్తున్న మొత్తం చాలా చిన్నదనే చెప్పాలి. కానీ అనుమతుల మాటున ఎంతెంత మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రాంతం.. నిర్వాహకులను బట్టి ఒక్కో పందిరికి రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఊరేగింపునకు మరో రేటు.

రూ. లక్షల్లో దోపిడీ..
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 2 వేలకు పైగా విగ్రహాలు ఏర్పాటు చేస్తే విజయవాడ నగరంలో 1,350 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఈ సంఖ్య 4 వేలకు చేరుకుంటుందనే అంచనా.  ఇలా ఒక్కో పందిరికి నాలుగు శాఖలు కలిపి సగటున రూ.3 వేలు మామూళ్ల రూపంలో వసూలు చేసినట్లయితే మొత్తం 4 వేల పందిళ్లకు రూ. 1.20 కోట్ల వరకు దోపిడీకి అవకాశముందని తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు సిఫార్సులు వల్ల అనుమతులన్నీ టీడీపీ వర్గీయులకు ఇవ్వడం జరుగుతుందన్న ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా మైలవరం, జగ్గయ్యపేట, బందరు, పెనమలూరు నియోజవర్గాల్లో టీడీపీ నాయకుల హవా నడిచినట్లు సమాచారం. ఇక్కడ కూడా భారీగా దండుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు