ఎవరికివారే యమునాతీరే

4 Jul, 2019 08:49 IST|Sakshi
ఆమదాలవలస ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీ కుర్చీతో  దర్శనమిస్తున్న పీఓ చాంబర్‌

ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా విధులు

30 రోజులుగా సెలవుల్లో ఉన్న సంయుక్త పీఓ

సాక్షి, ఆమదాలవలస(శ్రీకాకుళం) : ఆమదాలవలస ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారిగా కొత్తూరు ప్రాజెక్టు ఏసీడీపీఓగా పనిచేస్తున్న టి. విమలారాణి కొన్ని నెలల క్రితం విధుల్లోకి చేరారు. అయితే ఆమె కొత్తూరు, ఆమదాలవలస రెండు ప్రాజెక్టులు చూస్తుండగానే మధ్యలో ఎన్నికలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఆమదాలవలస ప్రాజెక్టు పరిధిలోని కొన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్‌ను అప్పటి పాలకుల మాటను కాదనలేక విడుదల చేశారు. అయితే అప్పటికి ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ ఎఫ్‌ఏసీపీఓ అత్యుత్సాహం చూపిస్తూ వంజంగి, జీకె.వలస, చిట్టివలసలతోపాటు ప్రాజెక్టు పరిధిలో మరికొన్ని గ్రామాల్లో పోస్టులను భర్తీ చేశారు. 

మాజీ ప్రభుత్వ విప్‌ కనుసన్నల్లో నియామకాలు..?
ఎన్నికల ముందు మాజీ ప్రభుత్వ విప్‌ ఆదేశాల మేరకు కార్యకర్తల నియామకాలు పీఓ కార్యాలయానికి వచ్చినప్పటకీ కొత్తగా పోస్టింగ్‌లు వచ్చిన అభ్యర్థులకు ఆ నియామక పత్రాలు అందజేయకుండా గుట్టుగా ఉంచారు. కొత్తగా జాబ్‌ వచ్చిన వారికి ఎన్నికల ముందర ఆర్డర్స్‌ అందిస్తే కొంతమంది కార్యకర్తలు ఎదురు తిరుగుతారని, అందువలన ఎన్నికల తర్వాత ఆర్డర్‌లు ఇవ్వాలని విప్‌ చెప్పినట్లు సమాచారం. దీంతో కొత్తగా జాబ్‌ వచ్చిన వారికి ఎన్నికల తరువాత అనగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎఫ్‌ఏసీ పీఓ స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆర్డర్స్‌ అందజేసి, విధుల్లోకి అర్జెంటుగా చేరాలని ఆదేశించారు. దీంతో కొత్తగా పోస్టింగ్‌లు వచ్చిన వారు విధుల్లోకి చేరారు.

ఈ విషయంలో ఎఫ్‌ఏసీ పీఓకు ఆయా గ్రామాల నుంచి ఒత్తిడి రావడంతో పాటు తాను తప్పు చేశాను అనే కారణంతో వెంటనే సెలవుపై వెళ్లిపోయినట్లు సమాచారం. ఆమె సెలవులో వెళ్లిపోయిన తరువాత కార్యాలయంలో ఉద్యోగులతోపాటు, ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా పర్యవేక్షణ లోపించి, అధికారులంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన్న పనిచేస్తున్నారు. దీంతో ఆమదాలవలస ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా ఉందని ఆ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. 

పీఓ పోస్టు ఖాళీ
ఆమదాలవలస ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో పీఓ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీఓతో పొందూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏసీడీ పీఓ శాంతిశ్రీని ఆమదాలవలస ప్రాజెక్టుకు ఎఫ్‌ఏసీ ప్రాజెక్టు అధి కారిగా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు సమాచారం. అయితే ఆమె ఇక్కడ జాయిన్‌ అవకుండా వేరే చోటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోం ది. ఆమదాలవలస ఎఫ్‌ఏసీ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న టి.విమలారాణి కొత్తూరు ఏసీడీపీఓగా విధుల్లోకి చేరినట్లు సమాచారం. ఆమదాలవలస ప్రాజెక్టులో ఇన్‌చార్జి పీఓగా ఇక్కడే పనిచేస్తున్న సూపర్‌వైజర్‌ రత్నాంజలి విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలకు హజరైన ఆమె సమాచారం లేకుండా హజరుకావడంతో స్పీకర్‌ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన కూడా జరిగింది. ప్రస్తుతం ఆమదాలవలస ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిస్థితి అయోమయంగా ఉందనే చెప్పాలి.

మరిన్ని వార్తలు