రాజకీయ మతా‘ల’బు! 

6 Oct, 2019 12:13 IST|Sakshi

కమలానగర్‌. అనంతపురంలోని ఈ వీధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి చుట్టూ దీపావళి సందడి ఉంటోంది. ఓ రాజకీయ పార్టీని అంటిపెట్టుకొని దందా సాగించే ఈ వ్యక్తి.. నేతలతో పాటు అధికారులకూ సుపరిచితుడు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. టపాసుల వ్యాపారంలో చక్రం తిప్పేది మాత్రం ఈయనే. ఎవరికి ఎంత ముడుపు ముట్టజెబితే పని అవుతుందో.. ఏ నాయకుడిని ఎలా బుట్టలో వేసుకోవాలో ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంకేముంది.. మూడు రోజుల టపాసుల విక్రయం ఈ వ్యక్తి చేతిలో ‘వెలుగులు’ విరజిమ్ముతుంది.  

సాక్షి, అనంతపురం : దీపావళి పండుగకు నెల రోజుల ముందుగానే వ్యాపారస్తుల్లో సందడి మొదలైంది. మూడు రోజుల్లో పెట్టుబడి పోను లక్షల్లో ఆదాయం ఉండడంతో టపాసుల విక్రయం చుట్టూ అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దుకాణాల లైసెన్స్‌లకు ఇప్పటికే జిల్లా కేంద్రంలో 123 దరఖాస్తులు రాగా, జిల్లా వ్యాప్తంగా 263 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టరేట్‌ వర్గాలు వెల్లడించాయి. వీళ్లే కాకుండా డీలర్లు పదుల సంఖ్యలో ఉన్నారు. అధిక శాతం గుంతకల్లు పట్టణంలోనే ఉండటం గమనార్హం. ఇక్కడి నుంచి రాయలసీమ వ్యాప్తంగా టపాసులను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం వ్యాపారమంతా ‘జీరో’లోనే సాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఏమాత్రం పన్నులు చెల్లించకుండా వందల కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ, అగ్ని మాపక శాఖ, తూనికలు కొలతలు, పోలీసుశాఖ.. ఇలా ఎవరి ముడుపులు వారికి ముడుతుండటం వల్లే అందరూ తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. 

మీరు టపాసుల వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీ వద్ద పెట్టుబడికి డబ్బులు లేవా? అయితే కమలానగర్‌ కేంద్రంగా చక్రం తిప్పుతున్న ‘చంటి’గాడిని కలవండి. మీ పని అయిపోయినట్టే. మీరు వెళ్లి దుకాణంలో కూర్చుంటే చాలు.. అంతా ఆయనే చూసుకుంటాడు. మీరు చేయాల్సిందల్లా.. టపాసులు అమ్మి పెట్టడమే. కాకపోతే ఖర్చులు పోను, వడ్డీ కూడా చెల్లించుకోవాలి మరి. ఆ వ్యక్తితో డీల్‌ కుదిరితే ఇక మీ ఇంట్లో ‘దీపావళి’ పండగే.  

అనంతలో చంటిగాడు 
టపాసుల వ్యాపారం గత కొన్నేళ్లుగా రాజకీయమైంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి చెందిన అనుయాయులే ఈ వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. అయితే వీరి వెనుక ఉండి చక్రం తిప్పేది మాత్రం ఒక్కరే వ్యక్తి. ఓ రాజకీయ పార్టీని అడ్డుపెట్టుకొని కొన్నేళ్ల నుంచి ‘చంటి’గాడు ఈ తతంగం నడిపిస్తున్నాడు. టపాసుల వ్యాపారంలో చేయి తిరిగిన వ్యక్తి కావడంతో మిగిలిన వారు కూడా ఆయన దారిలోనే నడవాల్సిన పరిస్థితి. తమిళనాడులోని శివకాశి నుంచి తక్కువ ధరకు ప్రభుత్వాలకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా జిల్లాకు టపాసులను రప్పించడం ఈ వ్యక్తి ప్రత్యేకత. బయటకు చూపించేందుకు రూరల్‌ పరిధిలో కొంత సరుకును ఉంచుతుండగా.. మిగిలిన సరుకు శింగనమల సమీపంలోని సొంత గోదాములో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. 

ఎవరి ముడుపులు వారికి.. 
రూ.కోట్లలో సాగిస్తున్న వ్యాపారంలో ఎవరూ అడ్డు తగలకుండా ఎవరి ముడుపులు వారికి అందజేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ప్రభుత్వానికి పన్నులు చెల్లించారా? లేదా? అనే విషయాన్ని పర్యవేక్షించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఈ అధికారులు ఎప్పుడూ తనిఖీలు చేసిన పాపాన పోలేదు. టాపాసుల విక్రయాల్లో వ్యాపారస్తులకు దాదాపు 80 నుంచి 90శాతం లాభాలే. ఎంఆర్‌పీ, ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్లు, గడువు తేదీ తప్పనిసరిగా టపాసుల బాక్సులపై ముద్రించాలి.

ప్రస్తుతం శివకాశి నుంచి దిగుమతి అవుతున్న సరుకులో ఇలాంటి విషయాలు ఏవీ ఉండవు. వ్యాపారస్తుడు చెప్పిందే ధరగా వినియోగదారుడు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు జీరోతో దిగుమతి చేసుకుంటుండడంతో వ్యాపారస్తులు భారీగా లబ్ధి పొందుతున్నారు. అనంతలో కీలకమైన ఆ వ్యాపారి రూ.కోట్లకు పడగలెత్తాడు. ప్రతి ఏటా దీపావళి వస్తే అనంతలో ఇతని సందడి అంతాఇంతా కాదు. వ్యాపారస్తులకు సైతం అప్పు రూపంలో సరుకు ఇచ్చి వడ్డీ సహా వసూలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల ఆశీస్సులు ఉండటంతో ఈ చంటిగాని దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. 

దందా ‘సిండికేట్‌’ 
టపాసుల వ్యాపారం జిల్లా కేంద్రంలో దాదాపు ‘సిండికేట్‌’ కనుసన్నల్లో నడుస్తోంది. అలాగని ఎంతో మంది ఉంటారనుకుంటే పొరపాటు. ఓ వ్యక్తి కనుసన్నల్లోనే ఈ దందా సాగుతోంది. 20 నుంచి 30 ఏళ్లుగా టపాసుల వ్యాపారంలో పండిపోయిన ఈ వ్యక్తి చెప్పిందే ఇక్కడ వేదం. ఎవరికి దుకాణం దక్కినా.. వ్యాపారం మాత్రం ఆయన మాటకు కట్టుబడి సాగించాల్సిందే. యేటా ఈ దందా ఆసక్తికరంగా ఉంటోంది. పండుగకు వారం రోజుల ముందు నుంచి ఒకటే హడావుడి. అక్కడా.. ఇక్కడ.. అదిగో.. ఇదిగో.. వాళ్లూ.. వీళ్లూ.. ఇలాంటి హడావుడి మధ్య పండుగకు ఒక రోజు, రెండు రోజుల ముందు ‘దుకాణం’ తెరుచుకుంటుంది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా