2 నుంచి సమైక్య కళా భేరీలు

8 Nov, 2013 01:23 IST|Sakshi
2 నుంచి సమైక్య కళా భేరీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ లక్ష్మణరెడ్డి
 సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్న నేతల తీరును ఎండగట్టాలి
 రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించాలని పిలుపు

రాష్ట్ర విభజనపై ప్రజలను జాగృతం చేసేందుకు డిసెంబర్ 2 నుంచి 30 వరకు సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య కళా భేరీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ లక్ష్మణరెడ్డి తెలిపారు. ‘వంద రోజుల సమైక్య ఉద్యమ సమాలోచన’పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. గురువారం ఆయన వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, పి.రామారావు, పుత్తాశివ, పోతుల శివశంకర్, మాగంటి రాంబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
 
 రాష్ట్రం సమైక్యంగా ఉంటే కలిగే ప్రయోజనాలు, విడిపోతే వచ్చే నష్టాలను ప్రజలకు సాంస్కృతిక కళారూపాల ద్వారా వివరించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్న జేఏసీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ తెరపైకి వస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదనను సమైక్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తప్పదన్నట్టు ప్రకటనలిస్తూ సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్న సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీల తీరును ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విభజన రహస్యంగా జరగాల్సిన వ్యవహారం కాదని, కేంద్ర మంత్రుల బృందంతో పాటు దీనికి సంబంధించి ఇతర నివేదికలను ప్రజల ముందు చర్చకు ఉంచాలని డిమాండ్ చేశారు.
 
 సమైక్య ఉద్యమంలో ఏపీఎన్జీవోల పాత్ర అభినందనీయమే అయినా, కీలక సమయంలో వారు ఉద్యమాన్ని విరమించటం బాధాకరమన్నారు. సరైన సమయంలో వారు మళ్లీ ఉద్యమిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రులు, ఎంపీలు వెంటనే రాష్ట్రపతిని కలిసి కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ ఆకాంక్షను తెలియజేస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు పంపాలని సమైక్యవాదులను కోరారు. నవంబర్ 14 నుంచి 19 వరకు కర్నూలులో రచయితలతో సదస్సు నిర్వహిస్తామని, 20 నుంచి 28 వరకు 210 మంది కళాకారులకు సమైక్య ఉద్యమానికి సంబంధించి  వీధినాటకాలు, పల్లెసుద్దులు, జానపద గేయాలపై  కర్నూలులో శిక్షణ ఇస్తామని తెలిపారు. 9న ఒంగోలులో, 10న భీమవరంలో, 17న శ్రీకాకుళం, గజపతినగరంలో జిల్లా సదస్సులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు