విశాఖ ఇక.. వెలుగు బాట..!

5 Jul, 2019 11:09 IST|Sakshi

ఇన్‌చార్జి మంత్రిగా మోపిదేవి వెంకటరమణ 

నగరం, జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన

ఇప్పటికే పాలనను పరుగులు పెట్టిస్తున్న మంత్రి అవంతి 

ఆర్థిక రాజధానికి మోపిదేవి సారథ్యంతో మేలు

మోముపై చెరగని చిరునవ్వు.. తెలియని వారికి సైతం ఆత్మీయ పలకరింపు.. పాలనపై పట్టు.. ప్రజా సమస్యలపై అపారమైన అవగాహన.. ఇవన్నీ కలగలిసిన నేత మోపిదేవి వెంకటరమణ. రాష్ట్ర పశుసంవర్థక, మార్కెటింగ్, మత్స్యశాఖల మంత్రిగా ఉన్న ఆయన్ను విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి మోపిదేవిపై తనకున్న నమ్మకాన్ని.. విశాఖ అభివృద్ధిపై చిత్తశుద్ధిని పరోక్షంగా చాటారు. రాష్ట్రంలోనే పెద్ద నగరంగా.. ఆర్థిక రాజధానిగా విలసిల్లుతున్న విశాఖను గత ప్రభుత్వం గానీ.. ఇన్‌చార్జి మంత్రులుగా ఉన్నవారు గానీ.. పెద్దగా పట్టించుకోలేదు. ఉత్సవాలు, సంబరాలు, సదస్సుల పేరిట నిధుల దుబారా.. అట్టహాసాలు తప్ప విశాఖ జిల్లా అభివృద్ధికి నిర్ధిష్టంగా చేసిన కృషి ఏమీ లేదనే చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పగ్గాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అన్ని వర్గాల్లో సంతోషం నింపుతున్నారు. ఆయన బాటలోనే జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇప్పటికే నిత్యం పర్యటనలు, సమీక్షలతో ప్రజలకు చేరవయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి కూడా అనుభవశాలే కావడం విశాఖ ప్రగతికి మేలిమలుపు కాగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆయన సారథ్యంలో విశాఖ వెలుగులీనడం ఖాయమని అన్ని వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.     –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం


సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే పాలనను పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలతోపాటు ప్రజాసంకల్పయాత్రలో తాని  చ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రజారంజక పాలన సాగిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మరోవైపు విశాఖ జిల్లాలో పాలన పరుగులు పెడుతూ అభివృద్ధిలో దూసుకుపోనుంది. గడిచిన ఐదేళ్ల పాటు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు నిలయంగా మారిన విశాఖ మళ్లీ గాడిలో పడనుంది. ఇప్పటికే జిల్లా సీనియర్‌ రాజకీయ నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు జిల్లా పాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలు కూడా సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పాలనపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయపరుస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అట్టడుగు వర్గాల వారికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

అపారమైన అనుభవశాలి మోపిదేవి
ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాకు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావును ఇన్‌చార్జి మంత్రిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నియమించారు. అత్యంత సీనియర్‌ మంత్రి అయిన మోపిదేవికి నవ్యాంధ్రలో ఏపీ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1989 నుంచి రాజకీయాల్లో ఉన్న మోపిదేవి ఎన్నో కీలక పదవులు చేపట్టారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూచిపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోపిదేవికి తన కేబినెట్‌లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్స్‌ నేచురల్‌ గ్యాస్‌ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇక 2009లో రేపల్లె నుంచి గెలుపొందిన మోపిదేవిని వైఎస్సార్‌ తన కేబినెట్‌లో లా అండ్‌ కోర్టులు, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఐటీ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు. మహానేత అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య కేబినెట్‌లో మోపిదేవికి మళ్లీ అవే శాఖలను అప్పగించారు. ఇక ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన కిరణ్‌కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా దాదాపు పదేళ్ల పాటు అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగిన మోపిదేవిని విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు. జిల్లాలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పాలనాపరమైన వ్యవహారాలను ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షించనున్నారు. 

విశాఖను ఆదర్శ జిల్లా చేస్తా: ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి
జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. గతంలో మంత్రిగా, వైఎస్సార్‌సీపీ నేతగా జిల్లాలో చాలాసార్లు పర్యటించా. పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశానని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకొనిపోతానన్నారు. అర్ధవంతమైన సమీక్షలతో జిల్లా పాలనను గాడిలో పెట్టడంతోపాటు.. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ముకానీయనని మోపిదేవి అన్నారు. రాజధాని అమరావతి తర్వాత అత్యంత కీలకమైన విశాఖ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా తనను నియమించిన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలందరూ తనకు బాగా తెలుసునన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసునని అందర్ని సమన్వయపరుస్తూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా  విశాఖను తీర్చిదిద్దుతానని మంత్రి చెప్పారు. 

జిల్లాపై పూర్తి అవగాహన
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు అవంతి శ్రీనివాస్, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడుతో కలిసి సమీక్షలు నిర్వహిస్తూ జిల్లా పాలనపై పూర్తిస్థాయి పట్టు సాధిస్తూ పాలనను గాడిలో పెడుతున్నారు. తాజాగా పాలనలో అపారమైన అనుభవం కలిగిన మోపిదేవికి ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించడంతో జిల్లా పాలన మరింత వేగంగా పరుగులు పెట్టనుందని జిల్లా వాసులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తూ ఎలాంటి సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయపర్చడంలో మోపిదేవికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

వైఎస్సార్‌సీపీలోకి వచ్చింది మొదలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వెన్నంటి ఉంటూ మత్స్యకార నేతగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ముఖ్యంగా బీసీ అధ్యయన కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి బీసీ డిక్లరేషన్‌ ద్వారా బీసీలు పార్టీ పట్ల ఆకర్షితులయ్యేలా చేయడంలో మోపిదేవి పాత్ర ఎంతో ఉంది. ఇక విశాఖ జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. మంత్రిగా పనిచేసిన సమయంలో అనేకమార్లు జిల్లాలో పర్యటించడమే కాదు.. జిల్లాలో పలు సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో కృషిచేశారు. పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటపై టీడీపీ ముష్కరులు దాడి చేసి ఘటనలో పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ చైర్మన్‌గా మోపిదేవి గ్రామంలో పర్యటించి ఇరువర్గాలను సమన్వయపర్చడంలో ప్రత్యేక కృషి చేశారు.

అంతేకాదు మత్స్యకారులను ఏస్టీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ ఎదుట మత్స్యకారులు చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. మత్స్యకారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన చంద్రబాబు తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇలా గతంలో మంత్రిగా, పార్టీ నేతగా జిల్లాపై మంచి అవగాహన, పట్టు ఉన్న మోపిదేవి వెంకటరమణ తాజాగా ఇన్‌చార్జి మంత్రి హోదాలో రానున్న ఐదేళ్లు జిల్లాలో వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేయడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించడంలో తనదైన ముద్ర వేస్తారనడంలో సందేహం లేదు. 

   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు