‘ప్రజలు ఇబ్బందులు పడకుండా కట్టుదిట్టమైన చర్యలు’

9 Dec, 2019 16:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీపై ఉల్లిని అందిస్తున్నామని, ప్రజలు ఇబ్బందులు పడకూడదని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతు బజార్లలో ఉల్లి ధర రూ, 45 ఉండగా, ఏపీ రాష్ట్ర ప్రజలకు కిలో ఉల్లి రూ. 25కే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని అధిక ధరకు కొని రాష్ట్ర ప్రజలకు సబ్సిడీ కింద తక్కువ ధరకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర, కర్నూలు, రాజస్థాన్‌ నుంచి కిలో రూ.120 కొనుగోలు చేసి ఏపీ మార్కెట్లలో రూ.25కు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఉల్లి ధరల విషయంలో మొదటగా స్పందించిన రాష్ట్రం ఏపీనే అని పేర్కొన్నారు.

కాగా సెప్టెంబర్‌ నెలలో 6,739 క్వింటాళ్ల ఉల్లిని అధిక ధరకు కొనుగోలు చేసి తొలి విడతలో కేజీ రూ. 28కి సరఫరా చేశామని, మరోనెల రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండటంతో రూ. 25,85,18000తో ఉల్లిని కొనుగోలు చేశామని మంత్రి వివరించారు. అధిక వర్షాలతో దేశవ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడిందని, మహరాష్ట్ర వంటి రాష్ట్రాలలో పంట చేతికి రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటంతో పాటు నిత్యావసర వస్తువులపై అధిక భారం పడకుండా మర్కెట్‌ స్థిరీకరణ నిధి నుంచి చెల్లిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉల్లిని టర్కి, ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటోందని, ఆ స్టాక్‌ నుంచి 25000 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని రాష్ట్రానికి ఇవ్వాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు